యాదాద్రి జిల్లా:తిన్నింటి వాసాలు లెక్కపెట్టే రకం బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి అని, రాజకీయంగా అనేక పదవులిచ్చి పెంచి పెద్దజేసిన తల్లి లాంటి కాంగ్రేస్ పార్టీని ఖతం చేయాలనే కుట్రతో బీజేపీలో చేరారని,నమ్మి మళ్ళీ ఓటేస్తే మునుగోడును కూడా ముంచుతాడాని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ గురువారం చౌటుప్పల్ పట్టణంలో జరిగిన రివ్యూ మీటింగ్ లో పాల్గొని మాట్లాడుతూ మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అనేకరకాల సేవలు చేసి ఈ ప్రాంతంలో బడుగు,బలహీన వర్గాలకు మేలు చేశాడని గుర్తు చేశారు.
ఇప్పుడు ఆయన బిడ్డ,మునుగోడు ఆడబిడ్డ బాల్య స్రవంతిని గెలిపించి గోవర్ధన్ రెడ్డికి నిజమైన నివాళి అర్పించాలని కోరారు.ఇక్కడ గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి 18 వేల కాంట్రాక్టుల కోసం కాంగ్రేస్ పార్టీకి ద్రోహం చేసి,బీజేపీలోకి చేరి అవసరం లేని ఉప ఎన్నికలు తెచ్చాడని,తన వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీని,ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని తెలిపారు.
ఎమ్మెల్యే కాకముందే ప్రశ్నించే ప్రజలను బూతులు తుడుతూ బెదిరిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని, ఇక ఎమ్మెల్యేగా గెలిపిస్తే మునుగోడు ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించి ఈ ప్రాంతానికి సేవ చేసిన దివంగత నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురైన స్రవంతిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, మహిళా అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ,జిల్లా మహిళా సంఘం సహాయ కార్యదర్శి దొంగరి సంధ్య,తుంగతుర్తి మండల పార్టీ అధ్యక్షుడు తొంగరి గోవర్ధన్,ఉపాధ్యక్షుడు వెంకటయ్య,మహేందర్,ఉపేందర్,పద్మ, మండల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు.