మెరుగైన జీవితం కోసమో, కుటుంబ ఆర్ధిక పరిస్ధితుల వల్లనో లక్షలాది మంది భారతీయులు పొట్ట చేతపట్టుకుని వివిధ దేశాలకు వలస వెళ్తున్న సంగతి తెలిసిందే.అయితే అపారమైన ప్రతిభా పాటవాలతో పాటు శ్రమించే గుణం కారణంగా భారతీయులు అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.
ఇది ఆయా దేశాల్లోని స్థానికులకు కంటగింపుగా మారింది.ఎక్కడి నుంచో వచ్చి తమ అవకాశాలను కొల్లగొడుతున్నారనే అక్కసుతో జాతి, వర్ణ వివక్షను చూపుతూ భారతీయులను మానసికంగా కృంగదీస్తున్నారు.
ఇక హత్యలు, భౌతిక దాడుల సంగతి సరేసరి.నిత్యం ప్రపంచంలోని ఏదో ఒక మూల భారతీయులపై జాత్యహంకార దాడులు జరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.
భారతీయులే కాదు.మిగిలిన దేశాలకు చెందిన ప్రజలు కూడా వలస వెళ్లిన ప్రాంతంలోని స్థానికులకు లక్ష్యంగా మారుతున్నారు.
తాజాగా అమెరికాలో నలుగురు భారత సంతతి మహిళలపై విద్వేష దాడి జరిగింది.ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దాడికి పాల్పడింది కూడా మహిళే కావడం.టెక్సాస్‌లో బుధవారం జరిగిన ఈ ఘటన అమెరికాలో సంచలనం సృష్టించింది.డల్లాస్ నగరంలో తన తల్లి, మిత్రులతో కలిసి భోజనం చేసేందుకు వెళ్లగా… ఓ మహిళ జాత్యహంకార వ్యాఖ్యలు చేయడంతో పాటు విద్వేష దాడికి దిగింది.
ఎక్కడికెళ్లినా మీ భారతీయులే వుంటున్నారంటూ సదరు మహిళ ఎంతగా దూషించినా తమ తల్లి ఓపికగా భరించారని బాధితురాలి కుమార్తె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.దాడికి పాల్పడిన మహిళను మెక్సికన్ అమెరికన్ ఎస్మరాల్డా అప్టన్‌గా గుర్తించి పలు అభియోగాల మీద కేసులు నమోదు చేశారు.మరోవైపు ఈ ఘటనపై అమెరికాలోని భారతీయ సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇందుకు కారణమైన ఆ మహిళపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.