ఎన్నో అనూహ్య పరిణామాల మధ్య హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటెల రాజేందర్ బిజెపి నుంచి గెలిచారు.ఆయన్ను గెలవకుండా చేసేందుకు టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించే విధంగా కేసీఆర్ ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా, చివరకు రాజేందర్ ఈ ఎన్నికల్లో విజయం సాధించారు.
తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సీనియర్ కావడం , అన్ని వ్యవహారాలు పూర్తిగా తెలిసిన వ్యక్తి కావడంతో , ఇప్పుడు రాజేందర్ కు బిజెపి లో ఎటువంటి స్థానం ఉంది అనే చర్చ రాజకీయ వర్గాలలో మొదలైంది.టిఆర్ఎస్ 2023 సార్వత్రిక ఎన్నికల్లో అధికారానికి దూరం చేసి బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా ముందుకు తీసుకు వెళ్ళగలరు అని, ఆ స్థాయి ఉన్న వ్యక్తిగా బీజేపీ అధిష్టానం ఈటల రాజేందర్ ను గుర్తిస్తోంది.
ఈ క్రమంలోనే ఆయనకు ఇప్పుడు ఏ పదవి దక్కబోతోంది ? ఆయనకు ఏ విధంగా సముచిత స్థానం కల్పిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే శాసనసభ పక్ష నేతగా సీనియర్ నాయకులు లకు అవకాశం కల్పిస్తూ ఉంటారు .గతంలో బీజేపీలో కూడా శాసనసభ పక్ష నేతగా సీనియర్ నేత కిషన్ రెడ్డి , లక్ష్మణ్ వంటివారు పనిచేశారు.అయితే 2018 ముందస్తు ఎన్నికలలో బిజెపి నుంచి తెలంగాణలో రాజాసింగ్ ఒకరు మాత్రమే గెలుపొందారు.
దీంతో ఆయనకు శాసనసభాపక్ష నేతగా బిజెపి అవకాశం కల్పించింది .అయితే ఆ తరువాత జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా రఘునందన్ రావు గెలుపొందడంతో, ఆయనకు ఆ పదవిని కట్ట పెట్టబోతున్నారనే ప్రచారం జరిగింది.అయితే అప్పట్లో ఈ ప్రచారంపై బీజేపీ అధిష్టానం స్పందించింది.రాజా సింగ్ పదవికి ఎటువంటి డోకా లేదని హామీ ఇవ్వడంతో, ఆ వివాదం అక్కడితో సద్దుమణిగింది.
అయితే ఇప్పుడు సీనియర్ ఎమ్మెల్యే గా ఉన్న రాజేందర్ కు శాసనసభాపక్ష నేతగా అవకాశం కల్పిస్తే బిజెపికి రాబోయే ఎన్నికల్లో తిరుగు ఉండదనే అభిప్రాయం బీజేపీ అధిష్టానం పెద్దల్లో ఉండడంతో, రాజేందర్ కు అవకాశం కల్పించే ఛాన్స్ కనిపిస్తోంది.అదీ కాకుండా రాజాసింగ్ కేవలం గోసంరక్షణ, హిందుత్వం అంశాలపై మాత్రమే ఎక్కువగా స్పందిస్తారని, మిగతా అంశాలను పెద్దగా పట్టించుకోరు అనే అభిప్రాయం ఉండడంతో రాజేందర్ కి శాసనసభాపక్ష నేతగా అవకాశం దక్కే ఛాన్స్ ఉన్నట్లుగా బీజేపీ లో ప్రచారం జరుగుతోంది.