ఇప్పుడిప్పుడే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని, రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి మరింత బలం పెంచుకుని అధికారంలోకి వస్తుందనే నమ్మకం మొన్నటి వరకు అందరిలోనూ కనిపించింది.అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లను చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బిజెపి టిఆర్ఎస్ ల తో సమానంగా ఎన్నికల్లో పోటీ చేసినా గెలుస్తుందా అనే అభిప్రాయం అందరిలోనూ కలుగుతుంది.
ఆ విధంగా కాంగ్రెస్ కు దక్కిన ఓట్లు ఉన్నాయి.అయితే పరోక్షంగా హుజురాబాద్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ కు కాంగ్రెస్ సహకారం అందించింది అనే విషయం పక్కనపెడితే, ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీలో పెద్ద దుమారమే రేగుతోంది.
ముఖ్యంగా రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేసుకుంటూ పార్టీ సీనియర్ నాయకులు విమర్శలు చేస్తున్నారు.ఇక దుబ్బాక ఎన్నికల విషయమే భువనగిరి ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు.
కాంగ్రెస్ గట్టిగా పోరాడితే ఓటింగ్ శాతం బాగా పెరిగేది అని, కానీ ఎక్కువగా పోరాడితే ఓట్లు చీలిపోయి టిఆర్ఎస్ కు లాభం చేకూరుతుందనే తాము వెనక్కి తగ్గి పోయాము అంటూ చెప్పుకొచ్చారు.దుబ్బాక ఉప ఎన్నికలలో పని చేసినట్లుగా తాము హుజూరాబాద్ నియోజకవర్గంలో పని చేయలేదని పరోక్షంగా రేవంత్ విమర్శలు చేశారు.
ఇక్కడ చోటు చేసుకున్న పరిణామాల పై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయబోతున్నట్టు వెంకట్ రెడ్డి తెలిపారు.ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి ని ఇరికించే విధంగా ఆయన వ్యవహరించబోతున్నట్లుగా అర్థం అవుతోంది.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ స్పందించారు.మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన నిర్వాకం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన వ్యాఖ్యానించారు.

ఇక మరో సీనియర్ నేత సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ వ్యవహారంపై స్పందించారు.కాంగ్రెస్ కు డిపాజిట్లు వస్తే రేవంత్ ఘనత గా చెప్పుకునేవారు అని, అలా కాకపోతే పార్టీ సీనియర్ వల్ల ఈ పరిస్థితి వచ్చిందని ప్రచారం చేసుకునే వారని విమర్శించారు.కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు సర్వసాధారణమే అయినా, ఈ ఎన్నికల ఫలితాలతో తీవ్ర నిరాశా నిస్పృహల్లో ఉన్న పార్టీ క్యాడర్ ను ఏకం చేసి , ఇప్పుడు తనను టార్గెట్ చేసుకున్న పార్టీ సీనియర్లను తన దారికి తెచ్చుకుని ముందుకు వెళ్లడం రేవంత్ రెడ్డికి ఇబ్బందికరమే.