తెలంగాణలో పాదయాత్రల హీట్ పెరిగిపోతోంది.అన్ని రాజకీయ పార్టీలు , పార్టీల అధినేతలు కీలక నాయకులు అంతా పాదయాత్రలనే నమ్ముకుంటున్నారు.
అధికారంలోకి రావాలన్నా, ప్రజలకు పాదయాత్ర మాత్రమే షార్ట్ కట్ అని నాయకులంతా నమ్ముతుండడం తో తమ కాళ్లకు పని చెబుతున్నారు.నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేపట్టేందుకు తగిన ప్రణాళికలు రచించు కుంటున్నారు.
తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా, నాయకులు మాత్రం ఇప్పటి నుంచే హడావుడి పడుతున్నారు.దీనికి కారణం త్వరలోనే హుజూరాబాద్ నియోజకవర్గం లో ఉప ఎన్నికలు ఉండడంతో పాటు, తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనతో ఉన్నారని, అదే జరిగితే 2022 లోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముందుగానే అన్ని పార్టీల నేతలు అలెర్ట్ అయిపోతున్నారు.
ఇప్పటికే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లాల వారిగా పాదయాత్ర చేపట్టేందుకు షెడ్యూలు కూడా రెడీ చేసుకున్నారు.ఏదో విధంగా బిజెపిని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆయన ముందుకు వెళ్తున్నారు.
ఇలా కేంద్రంలో తమ పార్టీనే అధికారంలో ఉండటంతో అన్ని రకాలుగానూ తమకు కలిసి వస్తుందని సంజయ్ నమ్ముతున్నారు.ఇక కొత్తగా పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సైతం పాదయాత్ర పై మక్కువ చూపిస్తున్నారు.
వాస్తవంగా రేవంత్ ఎప్పుడో పాదయాత్ర చేపట్టాలని చూసినా, పార్టీ సీనియర్ నాయకులు నుంచి అభ్యంతరాలు తలెత్తడంతో తన నియోజక వర్గానికి పరిమితం అయిపోయారు.

అయితే ఇప్పుడు పార్టీ అధ్యక్షుడి హోదాలో తెలంగాణ అంతటా పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఆయన ఉన్నారు.దీనికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో రేవంత్ తెలంగాణ అంతటా పాదయాత్ర చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఇక కొత్తగా తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించిన షర్మిల కూడా పాదయాత్ర నే నమ్ముకున్నారు.

తన తండ్రి, తన అన్న రాజశేఖర్ రెడ్డి ,జగన్ ఇద్దరు పాదయాత్ర ద్వారా అధికారంలోకి రావడం, తనకి పాదయాత్ర చేసిన అనుభవం ఉండడంతో తెలంగాణ ప్రజల్లో బలమైన ముద్ర వేసుకునేందుకు ఆమె పాదయాత్ర ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఇలా అన్ని పార్టీల నేతలు పాదయాత్ర సెంటిమెంటును బలంగా నమ్ముతున్నారు.పాదయాత్ర చేపడితే ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని బలంగా నమ్ముతూ ఉండడంతోనే పాదయాత్రల సంస్కృతి పెరిగి పోయినట్టుగా కనిపిస్తోంది.