తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి వస్తే దానివల్ల తెలంగాణ కాంగ్రెస్ కు ఎంత ఉపయోగం ఉంటుందో తెలియదు కానీ ,ఆ పదవి కోసం ఆ పార్టీ నాయకులు పోటీ పడుతున్న తీరు చూస్తుంటే, ఆ పదవి కోసం ఇంత హడావుడి అవసరమా ? ఆ కసి ఏదో ఎన్నికల్లో గెలిచేందుకు చూపిస్తే, పార్టీకి ఉపయోగపడేదిగా అనే సెటైర్స్ రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి.ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితమే తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఎంపిక కోసం అభిప్రాయ సేకరణ చేపట్టి ఢిల్లీకి వెళ్లిన మాణిక్యం ఠాకూర్, అధిష్టానానికి నివేదిక సమర్పించారు.
ఇప్పట్లో పిసిసి అధ్యక్షుడు ఎవరు అనేది ప్రకటించబోము అని మాణిక్యం ఠాగూర్ ప్రకటించేశారు.
ఇదిలా ఉంటే పిసిసి అధ్యక్ష పదవి రేవంత్ కు ఫైనల్ అయిపోయిందంటూ ఒక ప్రకటన కూడా రేపో మాపో వెలువడబోతుంది అని తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు హడావిడి మొదలైంది.
దీనికి తగ్గట్టుగానే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడం, ఓ సమావేశంలో పాల్గొనడం, ఆ తరువాత రాహుల్ గాంధీ తో ను భేటీ కాబోతుండడం తో ఈ రోజే పిసిసి అధ్యక్షుడి ప్రకటన ఉంటుందని హడావుడి నడుస్తుండగానే, ఆకస్మాత్తుగా ఇదే పదవిని ఆశిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోనియా గాంధీతో భేటీ అవ్వడం ఈ సందర్భంగా ఆమెతో పిసిసి అధ్యక్ష పదవి గురించి చర్చించారు.ఇదిలా ఉండగా రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేస్తున్న కొంతమంది ఆయనకు కనుక పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే ,కాంగ్రెస్ పార్టీకి తాము రాజీనామా చేసి వెళ్ళిపోతామని హెచ్చరిస్తూ, కాంగ్రెస్ సీనియర్ల పేరుతో ఓ లేఖను సోనియాగాంధీకి రాశారు.
అయితే ఆ లేఖలో ఎవరి పేరు పెట్టలేదు.రేవంత్ రెడ్డి ఆర్ ఎస్ ఎస్ వ్యక్తిని, అటువంటి వ్యక్తి బీజేపీని ఎలా డీ కొడతారని లేఖలో ప్రశ్నించారు.తెలంగాణలో అన్ని పార్టీలు బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నాయని, కాంగ్రెస్ కూడా తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా బీసీ నేతలకు అవకాశం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.ప్రస్తుతం ఈ లేఖ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ లో హీట్ పుట్టిస్తోంది.