దేశంలో కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రభుత్వం ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ పొడిగించే పనిలో ఉంది.అయితే ఇప్పటికే బ్రతుకు తెరువు కోసం పట్టణాలకి వెళ్లి అక్కడ పని లేక, తినడానికి తిండి లేక ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస శిబిరంలో వేల సంఖ్యలో వలస కార్మికులు తల దాచుకుంటున్నారు.
వీరికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆహారం అందిస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటుంది.అయిన కూడా కొంత వరకు ఆహారం కొరత ఏర్పడుతుంది.
ఈ ఆహారం కొరత వారి మధ్య గొడవలకి కారణం అవుతుంది.తాజాగా న్యూఢిల్లీలోని కాశ్మీర్ గేట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరంలో ఆహారం కోసం తీవ్ర ఘర్షణ జరిగింది.
ఈ గొడవ కాస్తా పెద్దదై పునరావాస కేంద్రాన్ని తగులబెట్టేంత వరకూ వచ్చింది.కొంత మంది అక్కడి నుంచి తప్పించుకోవడానికి అని పక్కనే ఉన్న యమునా నదిలో కూడా దూకారు.
వారిలో ఒకరు చనిపోయినట్లు తెలుస్తుంది.ఇక అక్కడ కార్మికుడు చావుకి షెల్టర్ వద్ద కాపాలా ఉంటున్నసిబ్బంది కారణం అంటూ నిరసనలకి దిగారు.
ఈ నిరసనలు హింసాత్మకంగా మారి పోలీసుల మీద రాళ్ళు రువ్వెంత వరకు వచ్చాయి.వీరిని కంట్రోల్ చేయడానికి అదనపు బలగాలని రంగంలోకి దించాల్సి వచ్చింది.
అల్లర్లకి కారణం అని భావిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు.ఇక కార్మికులు ఆశ్రయం పొందుతున్న షెల్టర్ కి నిప్పు పెట్టడంతో ఇప్పుడు వారంతా మళ్ళీ రోడ్డు మీద పడ్డారు.
అయితే వలస కార్మికులకి సరైన ఆహారం అందించకపోతే ఇలాంటి ఘటనలు ప్రతిచోట చూడాల్సి వస్తుందని విపక్షాలు అంటున్నాయి.మరి ఈ పరిస్థితిని కంట్రోల్ చేయడంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని కోరుతున్నారు.