ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై అప్పట్లో పెద్దఎత్తున చర్చ జరిగింది.దీనిపై విపక్ష పార్టీలు ధర్నాలు, పోరాటాలు కూడా చేపట్టాయి.
అయినా వైసీపీ ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా దానికి సంబంధించిన జీవోను కూడా విడుదల చేసింది.ఆ తరువాత విపక్షాల నిరసనలపై ప్రజల నుంచి వ్యతిరేకత పెరగడంతో జనసేన, టీడీపీ పార్టీలు వెనక్కి తగ్గాయి.
ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈ అంశం ప్రస్తావనకు వస్తోంది.తాజాగా మరోసారి ఈ అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడానికి తాను గాని, తమ పార్టీ కానీ వ్యతిరేకం కాదని ఆయన అన్నారు.
ఈ విషయంలో వైసీపీ ద్వంద ప్రమాణాలు పాటిస్తూ రాజకీయాలు చేస్తోంది అని బాబు మండిపడ్డారు.
అసలు తానే మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టానని, అప్పట్లో దీనిపై జగన్ కు చెందిన సాక్షి మీడియా తనపై విమర్శలు చేసిందని బాబు అన్నారు.గురుకుల పాఠశాలలో ఇప్పటికే ఇంగ్లీష్ మీడియం ఉందని, అసలు తాము ఇంగ్లీష్ వ్యతిరేకం కాదని, ఇంగ్లీషుతో పాటు తెలుగు కూడా ఉండాలన్నదే తమ పార్టీ విధానమని బాబు అన్నారు.
అసలు తనకు ఇంగ్లీష్ రాదు అంటూ కొంతమంది వైసిపి నాయకులు విమర్శలు చేస్తూ అపహాస్యం చేస్తున్నారని, తాను చేసిన అభివృద్ధి చూసిన తర్వాత బిల్ గేట్స్, బిల్ క్లింటన్ వంటి వారు కూడా తనను ప్రశంసిస్తూ అభినందనలు తెలియడానికి వచ్చారంటూ బాబు వ్యాఖ్యానించారు.