ఏపీ తెలంగాణ రాష్ట్రాలు అధికారకంగా విడిపోయినా … తెలంగాణాలో సెటిల్ అయిన వారి సంఖ్య భారీగానే ఉంది.అది ఎంతగా అంటే అక్కడ దాదాపు 24 నియోజకవర్గాల్లో గెలుపోటములు ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు.
అందుకే తెలంగాణాలో అన్ని రాజకీయ పార్టీలు సెటిలర్స్ ఓట్లను గంపగుత్తగా తమ ఖాతాలో వేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.అంతకు ముందు వరకు ఆంధ్రావారి పేరు చెప్తేనే ఒంటి కాలిపై లేస్తూ… పంచ్ డైలాగులు వదిలే టీఆర్ఎస్ అగ్రనాయకులు సైతం మనసు మార్చుకుని ప్రేమ కురిపిస్తూ వస్తున్నారు.
ఇక తెలుగుదేశం పార్టీ అయితే… ఈ విషయంలో అందహారికంటే ముందే తన రాజకీయాన్ని మొదలుపెట్టేసింది.
మహాకూటమి పొత్తులో భాగంగా… సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో సీట్లు దక్కించుకున్న టీడీపీ ప్రచారంలో భాగంగా… ఆంధ్ర ప్రాంత నాయకులను.మంత్రులు .ఎమ్యెల్యేలను రంగంలోకి దించి వారితో ప్రచారం చేయిస్తోంది.అంతే కాదు సీమాంధ్ర ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఆంధ్ర నాయకులను ఇంచార్జిలుగా నియమించి అక్కడి బాధ్యతలను అప్పజెప్పింది.ఈ పరిణామం తో స్థానిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా… కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, సనత్‌నగర్ నియోజకవర్గాలతో పాటు సెటిలర్స్ ఎక్కువగా నివసించే ప్రాంతాల్లోని ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున నాయకులు చేరుకున్నారు.
అయితే… స్థానికంగా ఉన్న కార్యకర్తలకు ఏపీ నాయకులు సరైన ప్రాధాన్యం ఇవ్వకుండా ఆంధ్రా నుంచి వచ్చిన కార్యకర్తలే ప్రచారంలో దూసుకుపోతుండడం, అన్నీ తానై ప్రచారం చేయడంతో స్థానిక టీడీపీ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.మేము ఇప్పటివరకు పార్టీ కోసం కష్టపడుతూ వస్తున్నామని.కానీ కీలకమైన ఈ ఎన్నికల సమయంలో మమ్మల్ని పక్కనపెట్టి ఆంధ్రవారికి పెత్తనం ఇచ్చి మమ్మల్ని అవమానిస్తున్నారు అంటూ పార్టీ అధిష్టానం పై గుర్రుగా ఉన్నారు.
అయితే ఈ పరిణామాలు ఎక్కడ గ్రూపు విబేధాలకు దారితీస్తాయో.తిరిగి తిరిగి ఎక్కడ తమ కొంప ముంచుతాయో అని ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.