ఇక జగన్ వంతు వచ్చేసిందా ..? స్పీడ్ అందుకోనున్న కేసుల విచారణ ..?

రాజకీయ నాయకులందరి మీద ఉన్న పెండింగ్ కేసులన్నీ ఇప్పుడిప్పుడే ముందుకు కదులుతున్నాయి.కాకపోతే ఈ కేసులన్నీ ఎన్నికల సమయంలోనే ముందుకు కదులుతుండడం అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది.

 Ys Jagan Case Now At Court Steps-TeluguStop.com

తెలంగాణాలో కాంగ్రెస్ నాయకుల మీద వరుసగా పెండింగ్ కేసులు బయటకి వస్తున్నాయి.ఈ వరుసలోనే ఏపీ సీఎం చంద్రబాబు పేరు కూడా బయటకి వస్తుందని అంతా ఒకరకమైన అంచనాల్లో ఉన్నారు.

ఈ సమయంలోనే ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మీద ఉన్న అక్రమాస్తుల కేసులు ముందుకు కదిలే అవకాశాలు చాలా ఎక్కువాగా కనిపిస్తున్నాయి.అయితే జగన్ కేసుల్లో కోర్టు జోక్యంతోనే ముందుకు కదులుతున్నట్టు తెలుస్తోంది.

తనపై ఉన్న కేసుల్లో ఇప్పటికే జగన్ ప్రతీ శుక్రవారం కోర్టుకు హాజరవుతున్నారు.కాగా, ఆయన కేసుల్లో విచారణ మరింత స్పీడుగా సాగనుంది… జగన్‌, ఎమ్మార్‌, ఓఎంసీ కేసుల్లో స్టేలకు గడువు ముగుస్తుండడంతో విచారణ ముందుకు సాగనుంది.కింది కోర్టుల్లో స్టేలతో ఆగిన విచారణలకు సుప్రీం కోర్టు నిర్దేశించిన ఆరు నెలల గడువు సెప్టెంబర్ 28వ తేదీతో ముగియడంతో జగన్‌, ఎమ్మార్‌, ఓబుళాపురం మైనింగ్‌ కేసుల్లో వెంటనే విచారణ చేపట్టేందుకు లైన్ క్లియర్ అయ్యింది.మళ్లీ స్టేలు తెచ్చుకోలేకపోతే అన్ని కేసుల్లో విచారణ కొనసాగిస్తామని సీబీఐ కోర్టు నిన్ననే స్పష్టం చేసింది.

కింది కోర్టుల్లోని కేసుల విచారణలు స్టేలతో ఆగిపోతున్న నేపథ్యంలో స్టేలు ఉన్న కేసుల్లో ఆరు నెలలు దాటితే తాజాగా ఉత్తర్వులు పొందాల్సి ఉంటుందని, లేనిపక్షంలో అవన్నీ రద్దవుతాయంటూ మార్చి 28న సుప్రీం కోర్టు ఉత్తర్వులను కూడా ఇచ్చింది.

ఇక ఇప్పటికే జగన్‌ కేసుల్లో 11 చార్జిషీట్లు దాఖలు చేయగా… కేవలం 4 కేసుల్లో మాత్రమే విచారణ కొనసాగుతోంది.

మిగిలిన కేసుల్లోని నిందితుల్లో ఎవరో ఒకరు స్టేలు తీసుకుని ఉండటంతో విచారణ ముందుకుసాగడంలేదు.అదేవిధంగా ఎమ్మార్‌, ఓబుళాపురం కేసుల్లో కూడా విచారణ నిలిచిపోయింది.

ఈ స్టే గడువు నిన్నటితో ముగిసిపోయింది.ఈ కేసుల్లో పలువురు నిందితులు హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు.

వీటిపై విచారణలో భాగంగా విచారణ ప్రక్రియను నిలిపివేస్తూ ఉమ్మడి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.ప్రస్తుతం ఈ కేసుల్లో స్టేలను పొడిగించాలని కోరుతూ దరఖాస్తులు దాఖలు చేస్తున్నారు.

మరోపక్క హైకోర్టులో ఉన్న కేసులపై స్టేలను పొడిగించడానికంటే పిటిషన్‌లపై తేల్చేస్తామని హైకోర్టు స్పష్టం చేస్తోంది.

ఇప్పటికే ఓఎంసీ కేసులో రాజగోపాల్‌రెడ్డి, పెన్నా సిమెంట్స్‌ అధినేత ప్రతాప్‌రెడ్డి లాంటివాళ్లు దాఖలు చేసిన పిటిషన్‌లో వాదనలు పూర్తయ్యాయి.వాటిలో తీర్పులను రిజర్వు చేసింది కోర్టు.ఎమ్మార్‌ కేసులో కోనేరు రాజేంద్రప్రసాద్‌ దాఖలు చేసిన పిటిషన్‌లో వాదనలు కొనసాగుతున్నాయి.

కొన్ని కేసులు సోమవారం విచారణకు రానున్నాయని… మరికొన్ని కేసులను అక్టోబరు 5వ తేదీకి, ఇంకా కొన్ని కేసులను 11వ తేదీకి వాయిదా పడ్డాయి.దీంతో తదుపరి విచారణలోగా స్టేలపై కొత్త ఉత్తర్వులు పొందకపోతే విచారణ వేగవంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube