కరోనా నేపథ్యంలో మొన్నటివరకు క్రీడలు,సినిమా షూటింగ్ లు అన్ని కూడా బంద్ అయిపోయిన విషయం తెలిసిందే.చాలా రోజుల పాటు లాక్ డౌన్ కొనసాగడం తో ఇప్పుడిప్పుడే కొంచం క్రీడలు నిర్వహిస్తుండడం జరుగుతుంది.
ఈ క్రమంలోనే ఇటీవల ఐపీఎల్ విజయవంతంగా నిర్వహించడం తో అందరి దృష్టి క్రికెట్ పై పడింది.అయితే ఇలాంటి సమయంలో క్రికెట్ జట్టులో కరోనా కలకలం రేపింది.
ఏకంగా ఆరుగురు క్రికెటర్లు ఈ మహమ్మారి బారిన పడడం ఆ జట్టులో కలవరం కలిగిస్తుంది.ఇంతకీ ఆ క్రికెట్ జట్టు ఏది అని కలవరపడుతున్నారా.
అది పాకిస్థాన్ క్రికెట్ జట్టు లెండి.ప్రస్తుతం న‌్యూజిలాండ్ టూర్‌కు వెళ్లిన పాకిస్థాన్ టీమ్‌లో ఈ కరోనా కలకలం రేపింది.
ఈ వైరస్‌ను దాదాపుగా దేశం నుంచే తరిమేసిన న్యూజిలాండ్ లో పాక్ జట్టు రూపంలో కరోనా కేసులు వెలుగుచూడడం విశేషం.ఈ తాజా కేసులతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
అయితే కఠిన క్వారంటైన్ నిబంధనలు, లాక్‌డౌన్లతో న్యూజిలాండ్ ప్రభుత్వం అక్కడ కరోనా వైరస్ ను తరిమికొట్టింది.అగ్రరాజ్యం అమెరికా ను సైతం అల్లల్లాడించిన ఈ మహమ్మారి న్యూజిలాండ్ దేశంలో మాత్రం తోకముడుచుకుపోయింది.
ఇప్పటివరకు కరోనా మొదలైనప్పటి నుంచి చూసుకున్నట్లు అయితే దేశవ్యాప్తంగా కేవలం 1684 కేసులు మాత్రమే నమోదవ్వడం గమనార్హం.అయితే ఒకపక్క తమ దేశానికి వచ్చి పాక్ జట్టు క్రికెట ఆడటం సంతోషం కలిగించే అంశం అయినప్పటికీ కూడా ఇక్కడి నిబంధనలను కూడా వారు తప్పనిసరిగా పాటించడం కూడా చాలా ముఖ్యం అని అక్కడి అధికారులు చెబుతున్నారు.
డిసెంబర్ 18న జరగనున్న టీ20తో ఆ దేశంలో పాక్ టూర్ మొదలవ్వనుంది.ఈ టూర్ మొత్తంగా న్యూజిలాండ్-పాక్ జట్లు కలిసి మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనున్నారు.
మొత్తం 53 మంది పాక్ టీమ్ సభ్యులు పాక్ నుంచి బయలుదేరి న్యూజిలాండ్ చేరుకున్నారు.అయితే పాకిస్థాన్ నుంచి బయలుదేరే ముందే టీమ్ సభ్యులు అందరికి కూడా లాహోర్‌లో కరోనా లక్షణాలు ఉన్నాయేమో అని పరీక్షలు నిర్వహించగా, ఆ టెస్టుల్లో ఎవరికీ ఎలాంటి లక్షణాలు కనిపించలేదు.
అనంతరం న్యూజిలాండ్ రాగానే చేసిన పరీక్షల్లో మాత్రం వారిలో ఆరుగురికి పాజిటివ్‌గా తేలింది.ఇప్పుడు పాజిటివ్‌గా తేలిన ప్లేయర్స్ అందరికీ కనీసం మరో నాలుగుసార్లు టెస్టులు నిర్వహిస్తామని అక్కడి ఆరోగ్య శాఖ తెలిపింది.

అయితే తమ క్వారంటైన్ నిబంధనలను పాక్ క్రికెటర్లు ఉల్లంఘించడం తో పాక్ టీమ్‌కు చివరి వార్నింగ్ ఇచ్చి.టీమ్ ప్లేయర్స్ ఎవరూ రూమ్‌ల నుంచి బయటకు రాకూడదని స్పష్టం చేసినట్లు అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.మొత్తానికి పాక్ టీమ్ లో ఆరుగురికి పాజిటివ్ రావడం తో అక్కడ ఆడబోయే సిరీస్ పై వారి ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది.మరో విషయం ఏమిటంటే అసలు టీమ్ లో ఎవరెవరికి ఈ కోవిడ్ పాజిటివ్ అనేది వచ్చింది అన్న వివరాలు,పేర్లు మాత్రం బయటపెట్టడం లేదు.