మొన్న ఎయిమ్స్ నిన్న సఫ్దర్జుంగ్ హాస్పిటల్ గత వారం రెండు ప్రభుత్వరంగ సంస్థలు ఇలా సైబర్ దాడుల సంబంధించి వార్తలు నిత్యం వింటూనే ఉన్నాం, వార్తలలోకి రానివి కోకొల్లలు.ప్రస్తుతం మనం సైబర్ కాలంలో జీవిస్తున్నాం.
మన కార్యకలాపాలు అన్నిటిలోను డిజిటల్ సాంకేతికతలు సాయం చేస్తున్నాయి.ప్రత్యేకించి కోవిడ్ నేపథ్యం లో, ప్రతి ఒక్క రంగం డిజిటల్ మాధ్యమం పై ఆధారపడిపోవడాన్ని మనం గమనించాం.
పరిస్థితి ఎలా ఉందంటే సైబర్ సెక్యూరిటీ కీలకమైంది, అంతేకాక సైబర్ క్రిమినల్స్, మోసగాళ్ళు, హ్యాకర్స్ బారి నుంచి డేటా ను, నెట్వర్క్లు, సిస్టమ్స్ ను, వ్యక్తిగత గోప్యత ను కాపాడుకోవాలంటే అందుకు సైబర్ సెక్యూరిటీ ఎంతో అవసరమైంది గా మారిపోయింది.సమాజంలో ప్రతి ఒక్క వర్గానికి చెందిన, సమాజం లోని ప్రతి ఒక్క రంగానికి చెందిన డిజటల్ యూజర్ లు సైబర్ దాడులు చాలా వరకు ఏయే రకాలు గా జరుగుతూ ఉంటాయనేది తెలుసుకోవడం ముఖ్యం.
అలాగే, వాటిని వారు కాపాడుకోవడానికి భద్రమైన ఆన్ లైన్ అభ్యాసాల గురించిన అవగాహన ను కూడా ఏర్పరచుకోవలసి ఉంది.అంతేకాదు, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ సిఫారసు చేసిన మేరకు దేశం లో సైబర్ సంబంధిత దృఢత్వాన్ని కూడా పెంచుకోవలసి ఉంది.
సైబర్ సెక్యూరిటీ విషయం లో జాగృతి ని వ్యాప్తి చేయాలనే ఆలోచన మన ప్రభుత్వాలకు లేదనిపిస్తుంది.భద్రత డొల్లతనం, అధికారుల నిర్లిప్తత సామాన్య ప్రజలకు కంటకం గా మారింది.
నగదు లేకుండా డబ్బులు చెల్లించుకునే ప్రక్రియ మీద అవగాహన కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా కసరత్తు చేస్తోంది అని ప్రచారం జరుగుతుంది కానీ ప్రజలకు సైబర్ సెక్యూరిటీ పై అవగాహన ఏమాత్రం లేక భారీగా నష్టపోతున్నారు.పైగా వాటిల్లో భద్రత డొల్లతనం ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే బ్యాంకర్ లకీ బ్యాంకులకీ తగిన హెచ్చరికలు జారీ చేయాలి.
బ్యాంకుల వెబ్ సైట్ ల మీద సైబర్ దాడులు, డెబిట్ కార్డ్ మోసాలు , సర్వర్ లలోకి అనధికార యాక్సిస్ లూ జరుగుతూ ఉండడం కామన్ అయిపొయింది.వాటిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలి.
సైబర్ సెక్యూరిటీ పరంగా ఎలాంటి సంఘటన జరిగినా బ్యాంకులు ఆర్బీఐ కి రెండు నుంచి ఆరు గంటల్లోగా సమాచారం అందించాలని ఆదేశాలు జారీ చేసిన వాటిని బుట్టదాఖలు చేసారు.సకాలానికి రిపోర్ట్ చేయకపోయినా, రుణ మోసాలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించినా బ్యాంకర్లపై క్రిమినల్ చర్యలు చేపట్టాలి.
నా పేస్బుక్ హ్యాక్ అయినది, ఎవరో నా స్నేహితులను, బంధువులను, పరిచయస్తులను డబ్బు అడుగుతున్నారు , దయచేసి ఎవరూ డబ్బు పంపొద్దు అన్న సమాచారం ఈ మధ్య కాలంలో ఎక్కువగా పాపులర్ అయ్యింది.మీ అకౌంట్లో డబ్బు జమ అవుతున్నది మీకు జమ అయిన కొద్ది సేపటికి ఓటిపి వస్తుంది అది మీరు ఎవరూ లేని చోటికి లేదా ఏకాంత ప్రదేశం లో మాకు చేరవేస్తే మరింత డబ్బు పంపడం వీలుపడుతుంది అని ఒక ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ కు ఫోన్ చేసి నిమిషాల్లో ఓటిపి తెలుసుకొని మూడు లక్షల పైగా డబ్బు డ్రా చేసిన వారు కొందరు.
ప్రతి రోజు లక్షా ఎనభై వేల పేస్బుక్ అకౌంట్లు హ్యాక్ అవుతున్న విషయం తెలిసిందే.
![Telugu Aims, Banks, Cyber, Cyber Security, Safdargunj-Latest News - Telugu Telugu Aims, Banks, Cyber, Cyber Security, Safdargunj-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2022/12/When-to-get-out-of-security-loopholes-cyber-attacks-data-hackings-detailsa.jpg )
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ఎక్కువ మంది మోసపోతున్నారు.వారిలో బాగా చదువుకున్న మేధావులు అధికంగా ఉంటున్నారు.ఎప్పుడో మీరొక పాలసీ చేశారు మీరు ఆ పాలసీ ఆరు సంవత్సరాల క్రితం విత్ డ్రా చేసుకున్నారు కానీ ఇంకా ఆ పాలసీ క్లోజ్ కాలేదు కొంత సొమ్ము అలాగే ఉండి పోయింది.
మీ ఖాతా వివరాలు ఆధార్ నంబర్, పాన్ నంబరు తదితర వివరాలు పంపండి అలాగే నామినేషన్ వివరాలు కూడా పంపండి అని పక్కా ప్రణాళికతో బురిడీ కొట్టించే మేధావులున్నారు.మీకు వంద గజాల స్థలం ఉందా మీరు ఈ నెంబరుకు పట్టా పేపర్లు, పాస్ బుక్, పంపితే మేము ఇరవై లక్షలు ఇచ్చి అక్కడ సెల్ టవర్ ఏర్పాటు చేస్తాము అలాగే మీ ఖాతాలోకి ప్రతి నెల నలభై వేలు జమ చేస్తాము అని ప్రాసెసింగ్ ఫీజు కేవలం పదివేలు కడితే చాలు, మీరు పది సంవత్సరాల పాటు నిశ్చింతగా ఉండొచ్చు.
కరోనా రెండవ వేవ్ లో మృతి చెందిన సాఫ్టువేర్ ఇంజినీర్ కుటుంబానికి చనిపోయిన మరుసటి రోజు మేము మీ అబ్బాయి పనిచేసే కంపెనీ హెచ్ఆర్ మాట్లాడుతున్నాను మీ అబ్బాయి టర్మినల్ బెనిఫిట్స్ దాదాపు ఎనభై లక్షలు దాకా మా దగ్గర ఉన్నది మీ కోడలు పాసు బుక్, పాన్, ఆధార్, చనిపోయిన వ్యక్తి ఆధార్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవ్వమని చెప్పి, మీ అబ్బాయి ఆరు లక్షలు కడితే కోటి రూపాయలు వస్తుందని నమ్మబలికి సర్వం ఊడ్చేశారు.
![Telugu Aims, Banks, Cyber, Cyber Security, Safdargunj-Latest News - Telugu Telugu Aims, Banks, Cyber, Cyber Security, Safdargunj-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2022/12/When-to-get-out-of-security-loopholes-cyber-attacks-data-hackings-detailss.jpg )
భారతదేశంలో సైబర్ నేరాలను నియంత్రించే చట్టాలు ఏవి?సైబర్ క్రైమ్‌లో దొంగతనం, మోసం, ఫోర్జరీ, పరువు నష్టం, అల్లర్లు వంటి నేర కార్యకలాపాలు ఉంటాయి.వీటన్నింటికీ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం శిక్షలు విధిస్తారు.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000 కింద అన్ని రకాల సైబర్ నేరాలకు శిక్షలు అమల్లో ఉన్నాయి.
కాని సైబర్ నేరాలను నిరోధించే వ్యక్తులు, అలాగే సైబర్ చట్టం గురించి కనీస అవగాహన మన సంరక్షులకు లేక పోవడం దురదృష్టకరం.ఏ సెక్షన్ వర్తిసుందో స్టేషన్ హౌస్ ఆఫిసరుకు, జిల్లా స్థాయి అధికారులకు తెలియని పరిస్థితి.
సైబర్ చట్టం అమలుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పోలీసు మరియు న్యాయ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఆర్థిక రంగాల్లో పనిచేసే వ్యక్తులకు అవగాహన శిబిరాలు, పునశ్చరణ తరగతులు పెట్టాలి.ఇంటర్నెట్ వంటి ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా వేధింపులకు గురిచేయడాన్ని సైబర్ స్టాకింగ్ అంటారు.
ఆస్తులను లక్ష్యంగా చేసుకునే దాడులను ఆర్థిక నేరాలు అంటారు.ఆస్తిపై హక్కును, ఓనర్‌షిప్‌ను అక్రమంగా మార్చుకోవడం, చట్టవిరుద్ధంగా ఒకరి వ్యక్తిగత ప్రయోజనాలను దెబ్బతీయడం వంటివన్నీ ఈ జాబితాలో ఉంటాయి.
![Telugu Aims, Banks, Cyber, Cyber Security, Safdargunj-Latest News - Telugu Telugu Aims, Banks, Cyber, Cyber Security, Safdargunj-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2022/12/When-to-get-out-of-security-loopholes-cyber-attacks-data-hackings-detailsd.jpg )
సోషల్ ఇంజనీరింగ్ పద్ధతులు లేదా ఫిషింగ్ వంటి అధునాతన సాంకేతిక పద్ధతులను ఉపయోగించడం ద్వారా మోసగాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాంకు అకౌంట్లలో డబ్బు దోచుకోగలరు.సైబర్ నేరాలపై ఎవరికి ఫిర్యాదు చేయాలి?సైబర్ దాడులకు గురైనవారు సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సెల్‌కు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.బాధితుల పేరు, మెయిలింగ్ అడ్రస్, ఇతర వివరాలను ఫిర్యాదులో పేర్కోవాలి.నేరం ఎలా జరిగిందనే అంశాన్ని రిపోర్టులో పూర్తిగా నమోదు చేయాలి.అత్యవసరమైతే స్థానిక పోలీస్ స్టేషన్‌ను సంప్రదించవచ్చు.ఇంటర్నెట్, నెట్ బ్యాంకింగ్, ఆన్లైన్ మార్కెటింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరు జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రభుత్వం ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలను ప్రచారం చేసి ప్రజలలో అవగాహన పెంచి నేరాలను అరికట్టాలి.అలాగే ఇలాంటి నేరాలను బహుళ ప్రాచుర్యం చేయాలి.
సైబర్ నేరగాళ్ల ద్వారా నష్టపోయిన వారు 155260 టోల్ ఫ్రీ నంబరు కు నేరం జరిగిన 48 గంటలలోపు తెలియపరిస్తే కొంత మేరకు నష్ట నివారణ చేయవచ్చు.