వినడానికి వింతగా ఉన్నా ఈ ఘటన నిజంగానే జరిగింది.ఆ వివరాలు తెలుసుకుందాం.
సాధారణంగా ఆధార్ కార్డు భారత పౌరుల గుర్తింపు నిమిత్తం అని తెలుసు.ప్రభుత్వ పథకాలు పొందడానికి కూడా ఆధార్ తప్పనిసరి.
ఇదంతా సామాన్య మనుషులకు.కానీ, దేవుడికి ఆధార్ కార్డు అడిగితే ఎలా? ఇలాంటి విచిత్ర ఘటనే ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.ఉత్తరప్రదేశ్ బండా జిల్లాలోని అత్తారా తహసీల్‌లోని కుర్హారా గ్రామానికి చెందిన మహంత్ రామ్‌కుమార్ దాస్ స్థానికంగా ఉన్న రాములవారి ఆలయంలో ప్రధాన అర్చకుడిగా పని చేస్తున్నారు.అంతేకాకుండా ఆలయ నిర్వహణ కూడా చూసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన ఆలయానికి సంబంధించిన భూమిలో గోధుమ పంట వేశాడు.అది దాదాపు 100 క్వింటాళ్లకు పైనే పండింది.
ఈ క్రమంలో రెండు రోజుల క్రితం దాస్ తమ పంటను అమ్మడానికి ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకుని పంట తీసుకుని ప్రభుత్వ మార్కెట్ యార్డ్‌కి వెళ్లారు.
అక్కడే అర్చకుడు రామ్‌కుమార్ వింత పరిస్థితి ఎదురైంది.
అధికారులు భూమి ఎవరిపేరు మీద ఉందో వారి ఆధార్ కార్డు సమర్పించాలని కోరారు.అయితే ఏడు హెక్టార్ల భూమి జానకి రాముల పేరిట రిజిస్టర్ అయి ఉంది.
దీంతో షాక్ తిన్న రామ్‌కుమార్‌కు ఏం చేయాలో తోచలేదు.పంట అమ్మాలంటే రాములవారి ఆధార్ కార్డు సమర్పించాలి.
ఈ క్రమంలో తాను శ్రీరామ స్వామి ఆధార్ కార్డు ఎలా తీసుకురాగలనని రామ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.తర్వాత సబ్ రిజిస్టార్ కార్యాలయానికి వెళి, అక్కడ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డీఎం) సౌరభ్ శుక్లాతో తన సమస్య గురించి వివరించాడు.
అయితే ఆధార్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయలేమని, పంట కొనలేమని చెప్పారు.దీంతో రామ్‌కుమార్ తాను గతేడాది ప్రభుత్వ మండిలో 150 క్వింటాళ్ల ధాన్యం అమ్మినట్టు తెలిపారు.
కొన్నేళ్లుగా ధాన్యం అమ్ముతున్నట్టు చెప్పారు.అయితే, ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని ఇప్పుడే తొలిసారి ఇటువంటి నిబంధనలు చూస్తున్నట్టుగా ఆవేదన వ్యక్తం చేశారు.
పంట అమ్మకపోతే తన కుటుంబం పస్తులతో చావడం తప్ప వేరే మార్గం లేదని కంట తడి పెట్టకున్నాడు.

జిల్లా పౌరసరఫరాల అధికారి గోవింద్ ఉపాధ్యా మాట్లాడుతూ ఆలయాలు, మఠాల నుంచి వచ్చిన ధాన్యాన్ని వ్యక్తుల ఆధార్ కార్డు లేకుండా అధికారులు కొనుగోలు చేయరాదని నిబంధనలు స్పష్టంగా ఉన్నాయన్నారు.అర్చకుడికి దేవుడి ఆధార్ కార్డు అడగలేదని, కేవలం ధాన్యం కొనుగోలు ప్రక్రియ గురించి వివరించినట్టు ఎస్‌డీఎం తెలిపారు.