భారతదేశ ప్రజలను, తెలుగు రాష్ట్రాల ప్రజలను గత కొన్ని నెలలుగా కరోనా మహమ్మారి గజగజా వణికిస్తోంది.గతంతో పోలిస్తే పరిస్థితుల్లో మార్పు వచ్చినా కరోనా సోకితే భవిష్యత్తులోనూ అనేక ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే ఈ మహమ్మారికి చెక్ పెట్టే అవకాశాలు ఉన్నాయి.వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న ప్రజలకు ఆక్స్ ఫర్డ్ శుభవార్త చెప్పింది.
బ్రిటన్ పత్రిక ద సన్ కథనం ప్రకారం నవంబర్ 2వ తేదీ నుంచి ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరగనుంది.ఇప్పటికే ఆక్స్ ఫర్డ్ సంస్థ తుది దశ క్లినికల్ ట్రయల్స్ లో తమ వ్యాక్సిన్ యువకులతో పాటు వృద్ధుల్లోనూ సమర్థవంతంగా పని చేస్తుందని చెప్పగా వ్యాక్సిన్ మరికొన్ని రోజుల్లో రానుండటంతో నెమ్మదిగా కరోనా కష్టాలు తీరనున్నాయి.
ఇప్పటికే రష్యా కరోనా వ్యాక్సిన్ ను విడుదల చేసినా వ్యాక్సిన్ సమర్థతపై అనుమానాలు ఉన్నాయి.
దీంతో ప్రజలు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తొలి సమర్థవంతమైన వ్యాక్సిన్ అని బలంగా విశ్వసిస్తున్నారు.
బ్రిటన్ పత్రిక కథనం ప్రకారం లండన్ లోని ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్ కు వ్యాక్సిన్ల ఫస్ట్ బ్యాచ్ ను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశాలు వెళ్లాయి.బ్రిటన్ లో నవంబర్ 2వ తేదీ నుంచి వ్యాక్సిన్ పంపిణీ జరగనుంది.
అయితే బ్రిటన్ కు చెందిన నేషనల్ హెల్త్ సర్వీసెస్ వ్యాక్సిన్ పంపిణీని ధృవీకరించాల్సి ఉంది.
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ను మొదట ఆ ఆస్పత్రిలోని వైద్యులు, సిబ్బంది తీసుకోనున్నారని సమాచారం.
మరోవైపు ఇతర కరోనా వ్యాక్సిన్లు సైతం తుది దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి.వ్యాక్సిన్ ప్రయోగాల్లో ఒకటి కంటే ఎక్కువ వ్యాక్సిన్లు సక్సెస్ అయితే తక్కువ సమయంలోనే కరోనా వైరస్ కట్టడి చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.