రాజకీయాలు అంటేనే వెన్నుపోట్లు, కప్పదాట్లు, అవకాశవాదం అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి.నీతి,గా నిజాయితీగా ప్రజలకు సేవ చేద్దాం అనుకునే నాయకులకు ఆదరణ లేక పోగా అడుగడుగునా అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
పార్టీలు కూడా సమర్ధులైన నీతి నిజాయితీ కలిగిన నాయకులకు సరైన ప్రాధాన్యం కల్పించకుండా అవకాశవాద రాజకీయాలు చేసేవారికి, భజనపరులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ముందుకు వెళ్తున్నాయి.తెలంగాణలో ఈ విధమైన ధోరణి ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తోంది.
ముఖ్యంగా ఖమ్మం జిల్లా విషయానికి వస్తే ఈ జిల్లాలో సీనియర్ నాయకుడిగా, ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు వ్యవహారాన్ని చూసుకుంటే ఈ విషయం బాగా అర్థమవుతుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరావు అభివృద్ధికి దూరంగా ఉన్న ఖమ్మం జిల్లాను అభివృద్ధి వైపు అడుగులు వేయించారు.
మారుమూల పల్లెలకు సైతం మంచి నీటి ట్యాంకులు, రోడ్లు, పక్కా ఇళ్లు, ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు.ఖమ్మం జిల్లాను అభివృద్ధిలో నెంబర్ వన్ గా నిలబడేలా చేశారు.
నిత్యం ప్రజాసేవ ధ్యేయంగా పని చేయడమే కాకుండా, కార్యకర్తలకు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల మనిషిగా, రైతుబిడ్డగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు.ఆయన సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నా ఎక్కడా ఎప్పుడూ అవినీతి ముద్ర ఆయన మీద పడలేదు.

ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తరువాత పరిణామాలను చూసుకుంటే తుమ్మల రాజకీయ జీవితంలో ఎత్తు పల్లాలు మొదలయ్యాయి.ఏపీ తెలంగాణ విడిపోయిన తరువాత టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరడం మంత్రి అవ్వడం జరిగాయి.మంత్రిగా ప్రభుత్వంలో చురుగ్గా పనిచేస్తూ ఖమ్మం జిల్లాలో నాయకులను సమన్వయం చేసుకుంటూ జిల్లా నాయకులందరినీ ఒక్కతాటిపైకి తెచ్చారు.కానీ తుమ్మల రాజకీయ ఎదుగుదలపై కొంతమందికి మింగుడుపడకపోవడం ఆయనకు వ్యతిరేకంగా పనిచేసి మొన్నటి ఎన్నికల్లో తుమ్మల ఓటమే ధ్యేయంగా ప్రత్యర్థి పార్టీలతో చేతులు కలిపి తుమ్మల ఓటమికి కారణం అయ్యారు.
తుమ్మల ఓటమి చెందినా టీఆర్ఎస్ లో ఆయనకు సముచిత స్థానం దక్కుతుందని ఎమ్యెల్సీ ని చేసి మంత్రిగా తుమ్మలకు అవకాశం కల్పిస్తారని అంతా భావించినా నిరాశే ఎదురయ్యింది.కొంతమంది నాయకులు తుమ్మల హవా ఖమ్మం జిల్లాలో కనిపించకుండా పావులు కదపడం, అడుగడుగున అవమానాలకు గురి చేస్తుండడం తదితర పరిణామాలు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.
ముఖ్యంగా సొంత పార్టీలో నెలకొన్న గ్రూపు రాజకీయాలతో ఆయన బాగా విసిగిపోయారు.తుమ్మలే కాకుండా ఆయన కు అత్యంత సన్నిహితుడుడిగా పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు లకు వ్యతిరేకంగా పావులు కదుపుతూ ఉండడం ఇవన్నీ ఇప్పుడు తుమ్మల వర్గానికి మంట పుట్టిస్తోంది.

పార్టీలో నెలకొన్న ఈ పరిణామాలపై అసంతృప్తితో ఉన్న తుమ్మలకు అటు బీజేపీ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి.ఆయన కనుక బీజేపీ లో చేరితే సముచిత స్థానం కల్పిస్తామని వర్తమానాలు అందుతున్నట్టు తెలుస్తోంది.ఇటీవలే బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తుమ్మలతో ఇదే విషయమై చర్చించినట్టు సమాచారం.సొంత పార్టీ నాయకుల వెన్నుపోట్లతో విసుగు చెందిన తుమ్మల కూడా పార్టీ మారితేనే బెటర్ అన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
అదే కనుక జరిగితే ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ బలహీనం అవ్వడం ఖాయం.ప్రస్తుతం కొంతమంది టీఆర్ఎస్ లో కీలక పదవులు పొందిన వారు తమ హవా నడిపిస్తున్నా వారి సత్తా ఏపాటిదో ప్రజలకు, పార్టీ నాయకులకు బాగా తెలుసు.
మరికొద్ది రోజుల్లో తుమ్మల రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.