నేటి సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచార తంతు ముగియనుంది.ఇప్పటి వరకు మైకులతో ఊదరగొడుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన నాయకులంతా , తమ ప్రచారానికి స్వస్తి చెప్పి ఎన్నికల వ్యూహల్లో మరింత మునిగి తేలనున్నారు.
సోమవారం పోలింగ్ జరగబోతుండడంతో , ఈ రెండు రోజుల్లో ఓటర్ల దృష్టిలో పడేందుకు అవసరమైన వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇక పలానా అభ్యర్థి ఎంత మెజారిటీ సాధించబోతున్నాడు ? పలానా పార్టీ అధికారంలోకి రాబోతోంది అంటూ జోరుగా పందాలు జరుగుతున్నాయి.ఏపీ, తెలంగాణలో చివరి రోజు ఎన్నికల ప్రచార తంతు హడావుడిగా ఉంది .బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా( JP Nadda ) నేడు కర్నూలు జిల్లా ఆదోనిలో పర్యటించనున్నారు .ఎన్ డి ఏ కూటమి అభ్యర్థి పార్థసారధి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

ఇక తెలంగాణలో బిజెపి కీలక నేత అమిత్ షా( Amit Shah) రెండు సభల్లో పాల్గొని బిజెపి అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ప్రజలను కోరనున్నారు.ఈరోజు ఉదయం 10 గంటలకు చేవెళ్ల నియోజకవర్గంలో వికారాబాద్ లో అమిత్ షా జనసభలో పాల్గొన్నారు.మధ్యాహ్నం 12 గంటలకు నాగర్ కర్నూల్ నియోజకవర్గం వనపర్తి లో బహిరంగ సభలో పాల్గొన్నారు.
ఈ సభ అనంతరం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.ఇక కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ( Priyanka Gandhi ) కూడా తెలంగాణలో చివరి రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
తాండూరు బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పాలనను వివరిస్తూ , కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ఆమె ప్రచారం చేయనున్నారు.ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి తో పాటు, పార్టీ ముఖ్య నేతలు హాజరవుతారు .ఇక కడపలో రాహుల్ గాంధీ పర్యటన ఉంది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో రాహుల్ గాంధీ( Rahul Gandhi ) పాల్గొంటున్నారు.కడప నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఇడుపులపాయకు రాహుల్ వెళతారు.అక్కడ వైఎస్సార్ ఘాట్ లో వైఎస్ సమాధికి నివాళులు అర్పించి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొంటారు.
ఆ తరువాత కడప నగరంలోని బిల్డప్ సర్కిల్ వద్ద పుత్ర ఎస్టేట్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిలకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.
ఇక వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్ ఈరోజు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.పిఠాపురం తో ఆయన ఎన్నికల ప్రచారాన్ని ముగించనున్నారు.
ఇక నేటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈరోజు సాయంత్రం 6 నుంచి సైలెన్స్ పీరియడ్ గా ఎన్నికల సంఘం పరిగణిస్తుంది .ఈరోజు సాయంత్రం.6 తర్వాత ఎటువంటి ప్రచార కార్యక్రమాలను నిర్వహించకూడదు.అలాగే రోడ్డు షోలు , సభలు సమావేశాలు , సోషల్ మీడియాలో ప్రచారాలు, పత్రిక ప్రకటనలు అన్నిటికి ఈరోజుతో ముగింపు పలకాల్సి ఉంటుంది. అలాగే ఈరోజు సాయంత్రం 6 తర్వాత నుంచి స్థానికేతరులు నియోజకవర్గాల్లో ఉండకూడదు .అలాగే బల్క్ మెసేజ్ లపైనా నిషేధం అమల్లో ఉంటుంది.