ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత జరిగిన ఎన్నికల్లో తెలంగాణాలో టీఆర్ఎస్, ఏపీ లో టీడీపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.అప్పటి నుంచి ప్రతి విషయంలోనూ ఈ రెండు రాష్ట్రాల మధ్య అనేక వివాదాలు చెలరేగాయి.
ఆ తరువాత చంద్రబాబు మీద ఓటుకు నోటు’ కేసు బుక్ అవ్వడం, పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లో ఉండే అవకాశం ఉన్నా అకస్మాత్తుగా అమరావతికి షిఫ్ట్ అయిపోవడం జరిగిపోయాయి.ఆ తరువాత కూడా తెలంగాణ, ఆంధ్ర నాయకుల మధ్య ఉప్పు – నిప్పు అన్నట్టుగా పరిస్థితి తయారయ్యింది.
చంద్రబాబు మీద ఉన్న కోపంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జగన్ కు అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందించి ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చేలా తన వంతు సహకారం అందించాడు.ఏది ఏమైనా ప్రస్తుతానికి జగన్, కేసీఆర్ రెండు రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో సమరస్యపూర్వకంగానే పరిష్కారం వెతుక్కుంటున్నారు.

తాజగా కేసీఆర్ జగన్ స్నేహ బంధం మీద పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగడంతో పాటు ఇరువురి రాజకీయ ప్రత్యర్థి అయిన టీడీపీ ఈ విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుందాంతో కొంతకాలం పాటు దూరం పాటించాలని చూస్తున్నారు.అంతే కాకుండా ఇరు రాష్ట్రాలకు సంబందించిన విషయాలతో పాటు ఏ విషయాల గురించి కూడా ఎటువంటి సమావేశాలు నిర్వహించకూడదనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది.ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీడీపీతో పాటు దాని అనుకూల మీడియా కేసీఆర్ తో జగన్ స్నేహంపై విమర్శలు చేస్తూ దాని కారణంగా ఏపీకి అంతులేని నష్టం జరుగుతోందని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది.గోదావరి నీటి మళ్లింపు వివాదాన్ని పెద్దది చేసి లబ్ధి పొందాలని కూడా టీడీపీ ప్లాన్ చేస్తోంది.

ఈ మధ్య కాలంలో తెలంగాణ, ఆంధ్రా మధ్య విభజన సమస్యల పరిష్కారంపై జగన్, కేసీఆర్ నాలుగైదుసార్లు సమావేశం అయ్యారు.ఈ సందర్భంగానే గోదావరి నీటిని శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు మళ్లించాలని కేసీఆర్ అడగ్గానే జగన్ ఒకే చెప్పడం ఆ సందర్భంలో జగన్ ను కేసీఆర్ పొగడ్తలతో ముంచెత్తడం జరిగిపోయాయి.అయితే జగన్ తన స్వార్థ ప్రయోజనాల కోసం కేసీఆర్ తో ఒప్పందం చేసుకున్నాడని, ఏపీ ప్రయోజనాల కోసం రాజీ పడుతున్నారని టీడీపీ పదే పదే విమర్శలు మొదలెట్టింది.ఇలా ప్రతి అంశంలోనూ ఇరువురిని రాజకీయంగా ఇబ్బందులు పెడుతుండడంతో కొంతకాలం దూరం పాటించాలని ఇరువురు నిర్ణయించుకున్నారట.
పైకి దూరం పాటించినా అంతర్గతంగా ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ముందుకెళదామనే ఆలోచనలో వీరు ఉన్నారట.