తెలంగాణ రాజకీయాల్లో ఎన్నో మార్పులు, అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నా, తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితిలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు.చెప్పుకోవడానికి సీనియర్ నేతలు చాలామంది ఉన్నా.
తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పగల ఉద్దండులు ఎంతోమంది ఉన్నా.తెలంగాణ కాంగ్రెస్ కు మాత్రం అవేవీ ఉపయోగపడటం లేదు.
నిత్యం గ్రూపు రాజకీయాలతో సతమతమవుతూ, సొంత పార్టీ నాయకులపైనే అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వారి పైన విమర్శలు చేస్తూ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తూ, వార్తల్లో ఉంటున్నారు తెలంగాణ సీనియర్ నేతలు.
కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైన మునుగోడులో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం చెందడానికి గ్రూపు రాజకీయాలే కారణం.
చాలామంది సీనియర్ నేతలు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండడం, పార్టీకి నష్టం చేకూరే విధంగా వ్యవహరించడం వంటివన్నీ అధిష్టానం గుర్తించింది.అందుకే రేవంత్ రెడ్డికి మరింత ప్రాధాన్యం ఇస్తూ ఆయన పాదయాత్ర చేపట్టేందుకు అనుమతిని ఇచ్చింది.
ఇక విషయానికి వస్తే.తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించడంతో సొంత పార్టీ నాయకుల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ గీత దాటి అనేకసార్లు వ్యవహరించినా, ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని, కానీ మర్రి శశిధర్ రెడ్డి విషయంలో ఇంత తొందరగా ఎందుకు స్పందించాల్సి వచ్చిందని కాంగ్రెస్ సీనియర్లు ప్రశ్నిస్తున్నారు./br>

క్రమశిక్షణ సంఘం చైర్మన్ చెన్నారెడ్డి సమావేశం ఏర్పాటు చేయకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని సీనియర్లు మండిపడుతున్నారు.ఇక జూమ్ మీటింగ్ కు రాలేదని 12 మందికి నోటీసులు జారీ చేయడం పైన దుమారం రేగుతోంది.సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ విషయాన్ని తప్పుపడుతూ… ఇదేమైనా కార్పొరేట్ కంపెనీ నా జూమ్ మీటింగులు నిర్వహించడానికి అంటూ మండిపడ్డారు.
ఇక ఈ తరహా సంఘటనలతో తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్టుగా కనిపిస్తోంది.
.