భారతీయ సాంప్రదాయం ప్రకారం చీర( Saree ) అనేది స్త్రీ హుందాతనానికి, సంపదకు, వైభవానికి చిహ్నం.ఎన్ని మోడ్రన్ బట్టలు వచ్చినా, పాశ్చాత్య సంస్కృతి చాప కింద నీరులా విస్తరిస్తున్నా .
చీరలో వున్న అందం మరే దుస్తుల్లోనూ కనిపించదు.ఇప్పటికీ భారతీయ స్త్రీలు చీరల వైపే మొగ్గు చూపుతున్నారు.
మారిన కాల మాన పరిస్థితులకు అనుగుణంగా చీరల్లోనూ రకరకాల మోడల్స్, డిజైన్లు అందుబాటులోకి వస్తున్నాయి.
భారతీయ మహిళలకు వేల సంవత్సరాలుగా ప్రతీకగా వున్న చీరకు ప్రపంచ స్థాయిలో మరింత గుర్తింపు తెచ్చేందుకు గాను ప్రయత్నాలు జరుగుతున్నాయి.
దీనిలో భాగంగా ‘‘జాతీయ చేనేత దినోత్సవం’’( National Handloom Day ) సందర్భంగా బ్రిటన్ రాజధాని లండన్‌లో( London ) వచ్చే ఆగస్ట్ 6న భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఆ రోజున బ్రిటన్‌లో స్థిరపడిన దాదాపు 500 మందికిపైగా భారత సంతతి మహిళలు( Indian Women ) అందమైన చీరలు ధరించి ప్రదర్శన ఇవ్వనున్నారు.
భారతదేశానికి చెందిన చేతివృత్తులు, నేత కార్మికుల దుస్థితిని హైలైట్ చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు.
‘‘ బ్రిటీష్ ఉమెన్ ఇన్ శారీస్ గ్రూప్ ’’ ఛైర్‌పర్సన్ డాక్టర్ దీప్తి జైన్ మదిలో మెదిలిన ఆలోచనకు అనుగుణంగా గతేడాది ‘‘లేడీస్ డే రాయల్ అస్కాట్ రేసెస్’’లో తొలిసారిగా ఈ తరహా ఈవెంట్ నిర్వహించారు.ఈ సందర్భంగా భారత ఉపఖండం నుంచి 1000 మందికిపైగా మహిళలు తమ ప్రాంతీయ కళారూపాలను ధరించి ప్రదర్శనలో పాల్గొన్నారు.యూకే-ఇండియా మధ్య సాంస్కృతిక సంబంధాలు బలోపేతం కావడంతో పాటు భారత స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన స్వదేశీ ఉద్యమాన్ని ఈ ఏడాది స్మరించుకోవాలని దీప్తి జైన్ భావిస్తున్నారు.
ఈ ఏడాది లండన్‌లోని ట్రఫాల్గర్ స్క్వేర్, పార్లమెంట్ స్క్వేర్ వంటి ఐకానిక్ ప్లేస్‌లలో ప్రదర్శన నిర్వహించాలని ఆమె తెలిపారు.వ్యక్తిగత, ప్రాంతీయ చీర శైలులను ప్రదర్శించడానికి 500 మంది మహిళలు సిద్ధంగా వున్నారని దీప్తి చెప్పారు.ఈ వాక్‌థాన్( Sari Walkathon ) భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్న సందర్భానికి సమాంతరంగా జరుగుతుందని ఆమె తెలిపారు.భారత్‌లోని దాదాపు 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన మహిళలను నిర్వాహకులు ఒకచోటకు చేర్చనున్నారు.కాగా.1905 ఆగస్ట్ 7న కోల్‌కతా టౌన్‌హాల్ నుంచి ప్రారంభమైన స్వదేశీ ఉద్యమాన్ని ‘‘జాతీయ చేనేత దినోత్సవం’’గా భారతదేశంలో పరిగణిస్తున్న సంగతి తెలిసిందే.