ఏపీ ఎన్నికల ప్రధాన కమిషనర్ గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో బిజెపి నాయకులు సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస రావు వ్యవహారం పెద్ద దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.ఈ ముగ్గురు హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్లో రహస్యంగా భేటీ అవ్వడం, దానికి సంబంధించిన దృశ్యాలు మీడియాలో ప్రచారం అవ్వడం, అలాగే వారు ఆ రూమ్ లో రహస్యంగా మాట్లాడుకున్న వ్యవహారాలకు సంబంధించిన వీడియో ఫుటేజీ వైసీపీ తమ దగ్గర ఉంది అంటూ చెప్పడం, ఇవన్నీ కలకలం రేపుతున్నాయి.
అసలు నిమ్మగడ్డ వ్యవహారం ఇప్పుడు ఏపీలో పెద్ద చర్చ జరుగుతున్న సమయంలో, అందులోనూ సుప్రీంకోర్టులో ఈ వ్యవహారం నడుస్తున్న సమయంలో నిమ్మగడ్డ తో చంద్రబాబు కి అత్యంత సన్నిహితులైన సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస రావు, భేటీ అవ్వడం వంటి పరిణామాలపై బిజెపి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.
ఈ పరిణామాలు బిజెపికి సంబంధం లేకపోయినా, ఆ పార్టీ నాయకులు ఈ వ్యవహారంలో ఉండడంతో సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ వ్యవహారంపై అధిష్టానం తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే బీజేపీలో మొదటి నుంచి ఉన్న నాయకులు ఈ వ్యవహారంపై మండిపడుతున్నారు.టిడిపి నుంచి బిజెపిలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి వారు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన వారు.చంద్రబాబు ప్రోద్బలంతోనే వారు బిజెపిలో చేరి కోవర్ట్ లు గా పని చేస్తున్నారని, అటువంటి వారు చేరడం వల్ల ఏపీలో బీజేపీ ఎదగకపోగా, మరింతగా నష్టపోతుందని వాపోతున్నారు.

ప్రస్తుతం నిమ్మగడ్డ వ్యవహారంలో సుజనాచౌదరి, కామినేని శ్రీనివాసరావు ఉండడంతో పార్టీ అధిష్టానం ఈ విషయంపై సీరియస్ గా దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది.ఈ వ్యవహారంపై వారి నుంచి వివరణ కోరడమా లేక వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమా అనే విషయాలపై ఇప్పుడు బీజేపీ లో చర్చ జరుగుతోంది.ఈ వ్యవహారంలో ఉన్న నాయకులపై సీరియస్ గా దృష్టిపెట్టకపోతే అంతిమంగా తెలుగుదేశం పార్టీకి లాభం చేకూరుతుందని బీజేపీ సీనియర్ లు కొంతమంది వాపోతున్నారు.అలాగే చంద్రబాబు కోవర్ట్ లు బీజేపీలో ఉన్నంతకాలం ఏపీలో పార్టీకి మనుగడ ఉండదని, ఎప్పుడైతే టిడిపి బలహీనపడుతుందో అప్పుడే బీజేపీకి ఏపీలో ఆదరణ పెరుగుతుందని సదరు నేతలు అధిష్టానానికి సూచిస్తున్నారు.