ఈ మధ్యకాలంలో సైబర్ నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగిపోతున్న కొద్దీ అరచేతిలోనే అవలీలగా దొంగతనాలు చేసేస్తున్నారు.
ఏ మాత్రం అలసత్వంగా ఉన్నా సెకన్లలో బ్యాంకు ఖాతాలను సైబర్ నేరగాళ్లు ఖాళీ చేసేస్తున్నారు.తాజాగా ఇలాంటి సైబర్ నేరమే ఒకటి వెలుగులోకి వచ్చింది.
ఓ వ్యక్తి తన ఫాస్టాగ్ ను రీఛార్జ్ చేసుకోని మోసపోయాడు.తన ఖాతాకు ఎక్కువ మొత్తంలో ఆ వ్యక్తి రీఛార్జ్ చేసుకున్నాడు.అయితే ఆ డబ్బులు తాను తిరిగి పొందే ప్రయత్నంలో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మొత్తం రూ.1.20 లక్షలను పోగొట్టుకున్నాడు.దక్షిణ ముంబైకి చెందిన ఓ వ్యక్తి ఇలా మోసపోవడం చర్చనీయాంశమైంది.
సదరు వ్యక్తి తన ఫాస్టాగ్ ఖాతాకు రూ.1500లకు బదులుగా రూ.15 వేలను పొరపాటున పంపించివేశాడు.అయితే తాను తన డబ్బును తిరిగి పొందేందుకు టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయాలనుకున్నాడు.
ఆన్ లైన్ లో ఫాస్టాగ్ కు చెందిన టోల్ ఫ్రీ నంబర్ కోసం వెతికాడు.ఒక నంబర్ సెర్చింగ్ లో కనిపించడంతో ఆ నంబర్ కే ఫోన్ చేశాడు.
అయితే ఆ వ్యక్తికి తెలియని విషయం ఏంటంటే ఆ నంబర్ ఫాస్టాగ్ వాళ్లది కాదు.

అది సైబర్ నేరగాళ్లకు సంబంధించిన నంబర్.టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయగా ఓ వ్యక్తి ఫాస్టాగ్ ఉద్యోగిగా మాట్లాడాడు.డబ్బును తిరిగి పొందేందుకు ఓ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలని తెలిపాడు.ఆ క్రమంలో బాధితుడి ఫోన్ ను సైబర్ నేరగాడు హ్యాక్ చేసి అకౌంట్ లో ఉన్న రూ.1.20 లక్షలను కాజేశాడు.బాధితుడు ఈ విషయాన్ని గుర్తించి ముంబైలోని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు రంగంలోకి దిగి సైబర్ నేరగాడిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.