ఎన్నికల సంఘం వెబ్‌సైట్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అఫిడవిట్లను మార్చారన్న ఆరోపణలపై వివాదం నెలకొంది.దీనిపై స్పందించిన మంత్రి బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయం నుంచి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
నిబంధనలకు విరుద్ధంగా తాను రెండు అఫిడవిట్లను ఈసీ వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేయించినట్లు కొందరు కోర్టులో పిటిషన్ వేసి, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారన్నారు.నామినేషన్లు వేశాక అఫిడవిట్ మార్చడం సాధ్యమా? అని ప్రశ్నించారు.ఓ మాజీ మంత్రి, మాజీ ఎంపీ తనపై అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.తనపై పుకార్లు పుట్టిస్తున్న వారి భరతం పడుతానని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు.
ఎన్నికల సంఘం వెబ్‌సైట్లో అఫిడవిట్లను మార్చారన్న ఆరోపణల ఉచ్చు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మెడకు బిగుసుకునేలా కనిపిస్తోంది.2018 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేసిన శ్రీనివాస్ గౌడ్ నిబంధనలకు విరుద్ధంగా రెండు అఫిడవిట్లను ఈసీ వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేయించినట్లు కొందరు ఈసీకి ఫిర్యాదు చేశారు.ఈసీ నిబంధనల ప్రకారం ఆస్తులు, అప్పులు, క్రిమినల్ కేసుల వివరాలతో ఆయన సమర్పించిన అఫిడవిట్‌ను ఈసీ తమ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.అయితే పోలింగ్ పూర్తయి, ఫలితాలు రావడానికి రెండు రోజుల ముందు కొత్త అఫిడవిట్ ప్రత్యక్షమైందని, అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు సవరించిన అఫిడవిట్‌ను శ్రీనివా్‌సగౌడ్ స్థానిక ఈసీ అధికారులతో కుమ్మక్కై అప్‌లోడ్ చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి.
దీనిపై గత ఏడాది ఆగష్టు లో ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పడు కేంద్ర ఎన్నికల కమిషనర్ చర్యలు చేపట్టింది.అంతర్గతంగా సాంకేతిక బృందంతో విచారణ జరిపిస్తోంది.విచారణ అంశం మంగళవారం వెలుగులోకి వచ్చింది.ఈ ట్యాంపరింగ్‌ను సాంకేతిక బృందం ధ్రువీకరిస్తే.
మంత్రిపై ఐపీసీ, ఐటీ చట్టాల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నుంచి కేంద్ర ఎన్నికల కమిషన్ నివేదిక తెప్పించుకుంది.
ఇందులో ఈసీ వెబ్‌సైట్‌ను మంత్రి ట్యాంపరింగ్ చేసిన విషయం నిజమేనని శశాంక్ గోయల్ పేర్కొన్నట్లు సమాచారం.అయితే ఈ అంశాన్ని ఎన్నికల అధికారులు ఎక్కడా బయట పెట్టడం లేదు.