మునుగోడు ఉపఎన్నిక అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో వేగంగా మార్పులు చోటుచేసుకోనున్నాయి.ఉపఎన్నిక ఫలితం వెలువడిన వెంటనే టీఆర్ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఫలితం అనుకూలంగా వచ్చినా, వ్యతిరేకంగా వచ్చినా టీఆర్ఎస్ మాత్రం ముందస్తుకే వెళ్లేందుకు సిద్ధంగా ఉందని టాక్.అందుకే ఈ ఉపఎన్నికను అన్ని పార్టీలు సెమీఫైనల్‌గా భావిస్తున్నాయి.
ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే ప్రజల్లో తమపై సానుకూలత ఉందని ప్రచారం చేసుకుంటారు.ఒకవేళ ఓడిపోతే ప్రజల్లో పార్టీ పట్ల వ్యతిరేకత ఇంకా పెరిగే చాన్స్ ఉందని భావించి కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది.
బై పోల్‌లో కీలకం కానున్న గల్లీ లీడర్లు.మునుగోడు నేతలు, ప్రజల పంట పండిందని చెప్పుకోవచ్చు.
ఉప ఎన్నికలు రావడంతో ముందుగా పార్టీ నేతలకు డిమాండ్ ఏర్పడింది.ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతల దరిద్రం అష్టకష్టాలన్నీ దూరమైపోతున్నాయి.
కాంగ్రెస్ గెలిచిన ఈ సీటులో కాంగ్రెస్ నేతలను టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు లక్షలు కుమ్మరించి వారిని తమ పార్టీలో చేర్చుకుంటున్నారు.చోటా మోటా నలుగురిని పోగేసుకొనే గల్లీ లీడర్స్ కూడా మునుగోడులో భారీ డిమాండ్ నెలకొందంటే అతిశయోక్తి కాదు.
కాంగ్రెస్ లీడర్లకే కాకుండా స్థానికంగా పలుకుబడి ఉన్న నేతలకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయట.
మునుగోడులో ఎవరు ఎక్కువ డబ్బులిస్తే నిర్మోహమాటంగా ఆ పార్టీలోకి వెళ్లేందుకు లీడర్లంతా చూస్తున్నారట.
అత్యధికంగా స్థానిక సంస్థల్లో గెలిచిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డుమెంబర్లకు గిరాకీ ఉంది.ఈ లీడర్లకు బోలెడంత డిమాండ్ నెలకొంది.
వీరికి టీఆర్ఎస్, బీజేపీల నుంచి ఆఫర్లు భారీగా వస్తున్నాయి.చాలా మంది ఈ ఉప ఎన్నికతో తమ ఆర్థిక అవసరాలు తీరుతాయని పార్టీలు ఉన్న పళంగా మారిపోతున్నారు.

మునుగోడులో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నందున.అందులోని కీలక లీడర్లకు టీఆర్ఎస్ గాలం వేస్తూ ఒక్కొక్కరిగా గులాబీ పార్టీలో చేర్చుకుంటోంది.ఇక రాజగోపాల్ రెడ్డి వెంట బీజేపీలోకి వెళ్లడానికి కాంగ్రెస్ నేతలు ఇష్టపడడం లేదట.ఆయనతో వెళితే ఓడిపోతామని టీఆర్ఎస్ లో చేరుతున్నారని టాక్.అయితే, టీఆర్ఎస్‌లోకి వెళ్లాలనుకునే వారిని రాజగోపాల్ రెడ్డి ఆపి వారి వారి ఖర్చులను కూడా భరిస్తున్నాడని తెలుస్తోంది.గోడమీద పిల్లుల్లా వ్యవహరించే లీడర్ల వలన ఏ పార్టీకి ఎంత ప్రయోజనం చేకూరుతుందో వేచిచూడాలి.