రష్యా సైనికులు చేసిన అరాచకం (171 లైంగిక హింస కేసులు)పై ఆ దేశ ప్రాసిక్యూటర్ కార్యాలయం దర్యాప్తు జరుపుతోందని ఉక్రెయిన్ ప్రథమ మహిళ ‘ఒలెనా జెలెన్స్కి’ తాజాగా ఓ మీడియా వేదికగా తెలిపారు.లైంగిక హింస మరియు యుద్ధ నేరాలపై ప్యానెల్ చర్చను ఉద్దేశించి జెలెన్స్కి మాట్లాడడం జరిగింది.
ఆమె మాట్లాడుతూ రష్యా సైనికులు చేసిన అరాచకంపైన అధికారిక గణాంకాలు ఉన్నాయని అన్నారు. ఉక్రేనియన్లపై లైంగిక హింసకు సంబంధించిన 171 కేసులను ప్రస్తుతం ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం దర్యాప్తు చేస్తోందని తెలిపారు.
అయితే ఈ సంఖ్య మహిళలకు మాత్రమే పరిమితం కాదని, బాధితుల్లో 39 మంది పురుషులు మరియు 13 మంది మైనర్లు వున్నారని అన్నారు.అంతే కాకుండా ఆక్రమిత ప్రాంతాలలో ఇంకా ఎంతోమంది మౌనంగా చిత్రవ్యధలను అనుభవిస్తున్నారు.రష్యా రేప్‌లు మరియు ఇతర యుద్ధ నేరాలకు సంబంధించిన తీర్పు అనేది ఇపుడు చాలా అవసరం, తద్వారా ప్రపంచంలోని ఏదైనా దురాక్రమణదారు, సామూహిక రేపిస్టులు తాము తప్పించుకోలేమని తెలుసుకోవాలి అని అభిప్రాయపడ్డారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ… “లైంగిక హింస అనేది ఒకరిపై ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి అత్యంత క్రూరమైన, జంతు సంబంధమైన మార్గం. ఇటివంటి ఘోరమైన చర్యలకు పాల్పడిన రష్యా భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు!” అని అన్నారు.లండన్‌లో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో ఆమె ఈ విధంగా మాట్లాడారు.
ఇదిలావుండగా రష్యన్లు ఉక్రేనియన్ పిల్లలను కిడ్నాప్ చేసి సెక్స్ కోసం అమ్ముతున్నారని కైవ్ మానవ హక్కుల కమిషనర్ ఆరోపించిన కొద్ది రోజుల తర్వాత శనివారం ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.