ముంబైలో( Mumbai ) గుండెలు పిండే విషాదం చోటు చేసుకుంది.27 ఏళ్ల యువకుడు కార్బన్ మోనాక్సైడ్( Carbon Monoxide ) అనే ప్రాణాంతక వాయువు పీల్చి ఆత్మహత్య చేసుకున్నాడు.అయితే, అతడు చనిపోయే ముందు పోలీసుల కోసం రాసిన హెచ్చరిక నోట్స్ అందరినీ దిగ్భ్రాంతికి గురి చేశాయి.
వివరాల్లోకి వెళితే, బెంగళూరుకు( Bengaluru ) చెందిన ఓ మహిళ ముంబై పోలీసులకు మంగళవారం ఈ-మెయిల్ ద్వారా తన సోదరుడు కనిపించకుండా పోయాడని ఫిర్యాదు చేసింది.
శనివారం చివరిసారిగా అతడితో మాట్లాడామని, ఆ తర్వాత ఫోన్ చేసినా స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది.
వెంటనే రంగంలోకి దిగిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అతడి ఫోన్ లొకేషన్ ట్రేస్ చేయగా.
అది వసాయిలోని( Vasai ) కమాన్ ప్రాంతంలో ఉన్నట్లు తేలింది.నైగావ్ పోలీసులు కేసును తమ చేతుల్లోకి తీసుకుని బుధవారం ఆ ప్రాంతానికి వెళ్లారు.
అక్కడ పారిశ్రామిక గోడౌన్ల మధ్యలో ఓ పాత బంగ్లా కనిపించింది.

బంగ్లా మెయిన్ డోర్ దగ్గరే పోలీసులకు “లోపల కార్బన్ మోనాక్సైడ్ ఉంది; దయచేసి లైట్లు వెయ్యొద్దు” అంటూ పెద్ద హెచ్చరిక నోట్ కనిపించింది.అంతేకాదు, బంగ్లాలోంచి దుర్వాసన కూడా వస్తోంది.పోలీసులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
ఫైర్ సిబ్బంది రక్షణ దుస్తులు, శ్వాస పరికరాలు ధరించి లోపలికి వెళ్లారు.బెడ్ రూంలో 27 ఏళ్ల యువకుడి మృతదేహం కనిపించింది.అతడు కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.మంచం పక్కనే గోడకు సూసైడ్ నోట్ టేప్ చేసి ఉంది.
గ్యాస్ లీక్ కాకుండా కిటికీలన్నీ చెక్క పలకలతో మూసివేశాడు.

బెడ్ రూమ్ డోర్ కు మరో నోట్ కనిపించింది.దానిపై కూడా “కార్బన్ మోనాక్సైడ్ లోపల ఉంది.దయచేసి లైట్లు వెయ్యొద్దు.
పోలీసులకు ఫోన్ చేయండి” అని రాసి ఉంది.ఫైర్ సిబ్బంది హైడ్రాలిక్ కట్టర్ ఉపయోగించి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు.
ఆ యువకుడు ఇంట్లో ఐదు గ్యాస్ సిలిండర్లు జాగ్రత్తగా అమర్చాడు.అందులో రెండు సిలిండర్లు తన చేతులకు కట్టేసుకున్నాడు.హెల్మెట్ పెట్టుకుని, నెబ్యులైజర్ ద్వారా నేరుగా గ్యాస్ పీల్చుకున్నాడు.ఫైర్ సిబ్బంది ట్యూబ్‌ను అతడి నోటి నుంచి, సిలిండర్ నుంచి వేరు చేశారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
సూసైడ్ నోట్‌లో అతడు గత ఏడాది కాలంగా తీవ్రమైన శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, వాటికి చికిత్స లేదని రాశాడు.
తన కుటుంబ సభ్యులు తనకు ఎంతో మద్దతు ఇచ్చారని, కానీ తాను ఇక భరించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ యువకుడు ఏడాది కాలంగా ఆ బంగ్లాలో ఉంటున్నాడు.
ఇంతకుముందు పవాయిలోని ఓ బ్యాంకులో ఉద్యోగం చేసేవాడు.కిటికీలు మూయడానికి రెండు రోజుల ముందు రోహిత్ విశ్వకర్మ అనే కార్పెంటర్‌ను పిలిపించాడని పోలీసులు గుర్తించారు.
అతడి వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేసుకున్నారు.