కేరళలోని( Kerala ) ఓ చిన్న పల్లెటూరు ఇప్పుడు ప్రపంచ పటంలో మెరిసిపోతోంది.కారణం అక్కడున్న ఓ బుల్లి మేక పిల్ల.
దాని పేరు కరుంబి.ఈ పిగ్మీ జాతి మేకపిల్ల ఇప్పుడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో ప్రపంచంలోనే పొట్టి మేకగా రికార్డు సృష్టించింది.
కరుంబి నల్లటి రంగులో ఉండే పిగ్మీ జాతి మేక( Pygmy goat ).దీని వయస్సు నాలుగు సంవత్సరాలు.కానీ ఎత్తు మాత్రం అక్షరాలా 1 అడుగు 3 అంగుళాలు (40.50 సెంటీమీటర్లు) మాత్రమే.పిగ్మీ మేకలు సాధారణంగా పొట్టిగా, లావుగా ఉంటాయి.
వాటి సగటు ఎత్తు 21 అంగుళాల (53 సెంటీమీటర్లు) వరకు ఉంటుంది.
కానీ కరుంబి మాత్రం వాటికంటే చాలా చిన్నది.నిలబడితే 1.4 అడుగులు (42.7 సెంటీమీటర్లు), పొడవునా చూస్తే కేవలం 1.1 అడుగులు (33.5 సెంటీమీటర్లు) మాత్రమే ఉంటుంది.అందుకే ఇది నిజంగా ప్రత్యేకమైన మేకపిల్ల.
2021లో పుట్టిన కరుంబి చాలా స్నేహపూర్వకంగా, సరదాగా ఉంటుంది.తన ఫామ్‌లో మూడు మగ మేకలు, తొమ్మిది ఆడ మేకలు, పది మేక పిల్లలు, ఆవులతో పాటు కుందేళ్ళు, కోళ్లు, బాతులతో కలిసి సందడి చేస్తుంది.తన సైజు చిన్నదే అయినా, తనకంటే పెద్దగా ఉండే వాటితో కూడా కలిసిమెలిసి ఆడుకుంటుంది.చూడటానికి ముద్దుగా అనిపిస్తుంది.కరుంబి యజమాని పేరు పీటర్ లెను.ఆయన వ్యవసాయ కుటుంబం నుండి వచ్చారు.
తన దగ్గరున్న పశువుల విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారు.పిగ్మీ మేకలు చిన్నగా ఉంటాయని ఆయనకు తెలుసు కానీ, కరుంబి ప్రపంచ రికార్డుకు అర్హత సాధిస్తుందని మాత్రం ఆయన ఊహించలేదు.
ఒకసారి వారి ఇంటికి వచ్చిన అతిథి కరుంబిని చూసి ప్రపంచ రికార్డు గురించి చెప్పడంతో అసలు కథ మొదలైంది.
వెంటనే పీటర్ కరుంబిని వెటర్నరీ డాక్టర్‌కు చూపించారు.డాక్టర్ కరుంబి ఎత్తు, వయస్సు, ఆరోగ్యం గురించి పూర్తిగా పరీక్షించారు.కరుంబి పూర్తిగా ఎదిగిందని, దాని చిన్న సైజుకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు కారణం కాదని డాక్టర్ నిర్ధారించారు.దాంతో కరుంబి అధికారికంగా రికార్డుకు అర్హత సాధించింది.ఈ విషయాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వాళ్లు చెప్పగానే పీటర్ ఆనందానికి అవధుల్లేవు.కరుంబి సాధించిన ఈ విజయం రైతులందరికీ గర్వకారణమని పీటర్ అంటున్నారు.
రైతులు తమ పశువులను ఎంత శ్రద్ధగా, ప్రత్యేకంగా పెంచుతారో ఈ విజయం ద్వారా తెలుస్తుందని ఆయన సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాదు, కరుంబి ఇప్పుడు గర్భవతి కూడా త్వరలోనే కరుంబి ఓ బుల్లి మేక పిల్లకు జన్మనివ్వబోతోంది.
ఆ చిన్నారి కోసం పీటర్ కుటుంబం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోంది.