శనివారం సాయంత్రం బెంగళూరు అనేకల్ తాలూకాలోని( Bangalore, in Anekal Taluka ) ప్రతిష్టాత్మక హుస్కూర్ మడ్డురమ్మ జాతరలో జరిగిన ఘోర ప్రమాదం కలకలం రేపింది.ఈ జాతరలో రథం కుప్పకూలగా, ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.ఈ ఘటనలో మృతి చెందినవారు తమిళనాడు హోసూరుకు చెందిన రోహిత్( Rohit ) (26), బెంగళూరు కేంగేరికి చెందిన జ్యోతి (14) అని గుర్తించారు.
అలాగే, బెంగళూరు లక్ష్మీనారాయణపురానికి చెందిన రాకేష్, మరొక మహిళ తీవ్రంగా గాయపడ్డారు.
హుస్కూర్ మడ్డురమ్మ జాతరలో( Huskur Madduramma Fair ) పాల్గొనే దొడ్డనగరమంగల గ్రామ రథం చిక్కనగరమంగల సమీపంలో కూలిపోయింది.
అయితే, ఈ ఘటనలో ఎవరూ మరణించలేదు.మరోవైపు, రాయసంద్ర గ్రామ రథం ఆలయం సమీపంలో భక్తులపై పడింది.
ఈ ప్రమాదంలో కొన్ని క్షణాల్లోనే భక్తులు రథం కింద చిక్కుకుపోయారు.ఈ రథం కింద చిక్కుకున్న ఆటో డ్రైవర్ రోహిత్, చిన్నారి జ్యోతి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
స్థానికుల కథనం ప్రకారం, ఊరేగింపు సమయంలో అధిక వర్షపాతం, బలమైన గాలులు వీచడం వల్ల రథాలు అదుపుతప్పి కూలిపోయినట్టు తెలుస్తోంది.2024లో కూడా రాయసంద్ర గ్రామ రథం కూలింది.అయితే, ఆసారి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.ఈ ఘటనపై హెబ్బుగొడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.భద్రతా చర్యలపై కూడా పోలీసుల దృష్టి సారించారు.
ఈ మడ్డురమ్మ జాతరలో ప్రతి గ్రామ రథానికి ప్రత్యేకత ఉంటుంది.ఎత్తైన రథాన్ని నిర్మించడం ప్రతిష్టాంశంగా భావిస్తారు.ఈసారి గట్టహళ్లి గ్రామం కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొత్త రథాన్ని నిర్మించింది.
ప్రతి సంవత్సరం ఊరేగింపులో పాల్గొనే గ్రామాలు తమ రథాన్ని మరింత పెద్దదిగా రూపొందించేందుకు పోటీపడతాయి.ఈ ఏడాది మొత్తం ఆరు రథాలు ఈ ఉత్సవంలో పాల్గొన్నాయి.మడ్డురమ్మ ఆలయానికి గొప్ప చరిత్ర ఉంది.ఈ సంవత్సరం దొడ్డనగరమంగల, రాయసంద్ర, లక్ష్మీనారాయణపుర, గట్టహళ్లి, కొడాతి, సంజీవనగర గ్రామాల నుండి రథాలు హుస్కూర్ జాతరలో పాల్గొన్నాయి.
ఈ మహా జాతర నాలుగు నుంచి ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది.చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వేలాదిగా హాజరవుతారు.ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచి వచ్చే భక్తుల సౌలభ్యం కోసం కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC) ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచాయి.ఈ ఉత్సవాన్ని అనేకల్ సబ్-డివిజనల్ పోలీసు అధికారి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు.
భక్తుల భద్రత కోసం CCTV కెమెరాలు, ప్రత్యేక పోలీసు బలగాలను మొహరించారు.జేబుదొంగలు, మొబైల్ చోరీలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాదం భక్తులను విషాదంలో ముంచేసింది.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు మరింత కఠిన భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.