తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది.అధికారంలోకి రావడమే లక్ష్యంగా తీవ్ర కసరత్తు చేస్తుంది.
ఈ క్రమంలోనే జాతీయ నేతలందరూ వరుసగా రాష్ట్రంలో పర్యటిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు.
తెలంగాణలో రెండు రోజుల క్రితమే పర్యటించిన ప్రధాని మోదీ ఇవాళ మరోసారి రాష్ట్రానికి రానున్నారు.
మొన్న మహబూబ్ నగర్ జిల్లా పాలమూరులో జరిగిన సభలో ప్రజలకు వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఛత్తీస్ గఢ్ పర్యటనను ముగించుకుని ప్రధాని మోదీ మధ్యాహ్నం నిజామాబాద్ జిల్లాకు రానున్నారు.
పర్యటనలో భాగంగా విద్యుత్, రైలు మరియు ఆరోగ్య రంగాలకు సంబంధించి ఇందూరులో రూ.8,021 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నారు.రూ.6 వేల కోట్లతో రామగుండంలోని ఎన్టీపీసీలో నిర్మించిన 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ ను ప్రజలకు అంకితం చేయనున్నారు.కాగా ప్లాంట్ లో ఉత్పత్తయ్యే విద్యుత్ లో 85 శాతం తెలంగాణలోనే వినియోగం కానుంది.వచ్చే డిసెంబర్ నాటికి రెండో దశ విద్యుత్ ప్రాజెక్టు పూర్తి కానుంది.
అలాగే ధర్మాబాద్ ( మహారాష్ట్ర) – మనోహరాబాద్, మహబూబ్ నగర్ – కర్నూల్ రైల్వే లైన్ ను మోదీ జాతికి అంకితం చేయనున్నారు.రూ.1200 కోట్లతో 76 కిలోమీటర్ల మేర నిర్మించిన మనోహరాబాద్ – సిద్దిపేట కొత్త రైల్వే లైన్ ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ కొమురవెల్లిలో రైల్వేస్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.అదేవిధంగా మొదటి విడతగా తెలంగాణలో 20 జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రుల్లో ఆయుష్మాన్ భారత్ కింద 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ లను ఆయన శంకుస్థాపన చేయనున్నారు.రాష్ట్రంలో 496 బస్తీ దవాఖానాలు, 33 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్, 31 జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రుల్లో క్రిటికల్ కేర్ బ్లాక్ ల నిర్మాణమే లక్ష్యంగా నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు రూ.1,369 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.అనంతరం ఇందూరులో నిర్వహించనున్న జనగర్జనలో మోదీ పాల్గొననున్నారు.తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మూడు రోజుల వ్యవధిలో ప్రధాని మోదీ పర్యటన బీజేపీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపుతోంది.