భారత సంతతికి చెందిన బ్రిటీష్ ఎంపీ తన్మన్ జిత్ సింగ్ ధేసీని ఇమ్మిగ్రేషన్ అధికారులు గురువారం ఉదయం అమృత్‌సర్ విమానాశ్రయంలో రెండు గంటల పాటు అడ్డుకోవడం కలకలం రేపుతోంది.దీనిపై పంజాబ్‌లోని విపక్ష శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) పార్టీ( Shiromani Akali Dal ) ఆయనకు అండగా నిలిచింది.
ఎస్ఏడీ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్( Sukhbir Singh Badal ) ఈ మేరకు ట్వీట్ చేశారు.అమృత్‌సర్ విమానాశ్రయంలో యూకే ఎంపీ ధేసీని నిర్బంధించడం అత్యంత శోచనీయమన్నారు.
సిక్కు సమాజానికి చెందిన ప్రముఖులు, గౌరవనీయుల వ్యక్తుల పట్ల ఇది ప్రతికూల సంకేతాలను పంపుతుందని బాదల్ ఆందోళన వ్యక్తం చేశారు.అంతేకాదు.భారత్-యూకేల మధ్య వున్న సంబంధాలు, లౌకిక ప్రతిష్టకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని.సిక్కుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందని సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ఆవేదన వ్యక్తం చేశారు.సిక్కు కమ్యూనిటీకి చెందిన వ్యక్తుల పట్ల ఇలాంటి అవమానకరమైన ప్రవర్తనకు బ్రేక్ వేసేందుకు వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కోరారు.అలాగే తన్మన్‌జిత్ పట్ల అత్యంత అమర్యాదగా ప్రవర్తించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సుఖ్‌బీర్ సింగ్ బాదల్ విజ్ఞప్తి చేశారు.
కాగా.గురువారం ఉదయం 9 గంటలకు బర్మింగ్‌హామ్( Birmingham ) నుంచి ఎయిరిండియా విమానంలో (AI-118)లో ఆయన అమృత్‌సర్ చేరుకున్నాడు.మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.ధేసీకి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డ్ లేదు.ఈ నేపథ్యంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అతడిని విమానాశ్రయంలో అడ్డుకుని ధ్రువపత్రాలు చూపించాల్సిందిగా కోరారు.అన్ని పత్రాలు సమర్పించి, చెకింగ్ పూర్తయ్యే సరికి దాదాపు రెండు గంటల పాటు సమయం పట్టింది.
అనంతరం ఉదయం 11 గంటలకు తన్మన్ జిత్‌ను అధికారులు భారత్‌లోకి అనుమతించారు.దీనిపై థేసీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
రైతులు, అట్టడుగున ఉన్నవారు , సిక్కుల వంటి మైనారిటీల కోసం నిలబడినందుకు ఇది తాను చెల్లించాల్సిన మూల్యం అని ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.మోడీ ప్రభుత్వం మూడేళ్ల క్రితం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహించిన ఆందోళనకు తన్మన్ జిత్ మద్ధతు పలికిన సంగతి తెలిసిందే.