రాజకీయాలకు దూరంగా ఉన్నా.ఎప్పుడూ ఏదో ఒక అంశంతో తెరపైకి వస్తూ ఉంటారు మాజీమంత్రి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం.2024 ఎన్నికల్లో ముద్రగడ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని, కచ్చితంగా ఎమ్మెల్యేగా కానీ, ఎంపీగా కానీ పోటీ చేస్తారని ప్రజలలో చర్చ జరుగుతోంది.అయితే ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది పక్కనపెడితే మరోసారి కాపు రిజర్వేషన్ల అంశంపై ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు.
ఈ లేఖలో అనేక అంశాలను ప్రస్తావించారు.సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్ పై ఇచ్చిన తీర్పు , రిజర్వేషన్లు రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చని కేంద్రమంత్రి ఇచ్చిన సమాధానం తదితర అంశాలను ప్రస్తావించారు .రిజర్వేషన్లపై పరిశీలన చేయాలని అందరూ అనుభవించగా, మిగిలిన దానిలో తమకు రిజర్వేషన్లు ఇప్పించాలని జగన్ ను ముద్రగడ లేఖ ద్వారా కోరారు.2019 ఎన్నికల్లో మెజార్టీ నియోజకవర్గాల్లో కాపు జాతి వైసిపి గెలుపు కోసం కృషి చేసింది అనే విషయాన్ని ముద్రగడ ప్రస్తావించారు.ముద్రగడ పూర్తి లేఖ ఈ విధంగా ఉంది.
” తమరికి గతంలో కూడా నా ( బలిజ కాపు తెల్లగా ఒంటరి) జాతి పోగొట్టుకున్న రిజర్వేషన్ విషయమై లేఖ రాశానండి.మరల ఈరోజు రాయడానికి గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు EWS పై ఇచ్చిన తీర్పు, రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు గారు అడిగిన ప్రశ్నకి కాన్స్టిట్యూషన్ 103,105 అమెండ్మెంట్ యాక్ట్ ,2019 &2021 అనుసరించి ఆర్టికల్ 342A (3) ప్రకారం రిజర్వేషన్లను రాష్ట్రంలో అమలు చేసుకోవచ్చు అని సోషల్ జస్టిస్ మంత్రి సుశ్రి ప్రతిమ భూమిక్ గారు 21-12-2022 న సమాధానం ఇచ్చారండి.పై విషయాలు పరిశీలించి రిజర్వేషన్ ఇవ్వడానికి దృష్టి పెట్టవలసిందిగా కోరుతున్నాను అండి.
నేను అడిగింది ఎవరికోటాలోను వాటా పెట్టమని అడగడం లేదండి.అందరూ అనుభవించగా మిగిలిన దానిలోనే ఇప్పించండి.2019 అసెంబ్లీ ఎన్నికలలో కొద్దిపాటి నియోజకవర్గాలలో తప్ప మిగిలిన అన్నిచోట్ల మా కాపు జాతి వారందరూ మీ గెలుపుకు ఉపయోగపడినారండి.మీరు మా కాపు జాతికి రిజర్వేషన్లను కల్పించి మరొకసారి మా కాపు జాతి మీ విజయానికి ఉపయోగపడేలా చూసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను అండి.
తమరు ఎన్నో కులాల వారికి వారి అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు దానం చేస్తూ వారి జీవితాలలో వెలుగులు చూపిస్తున్నారండి.అలాగే మా కాపు జాతి వారికి అటువంటి వెలుగు చూపించమని కోరుతున్నానండి.
నేను పుట్టిన ఊరు కోసం నాకు రాజకీయ బిక్ష పెట్టిన ప్రజల కోసం ఆఖరిగా నేను పుట్టిన కులం కోసం అవకాశం ఉన్నంతవరకు ఇతరులకు నష్టం లేకుండా సహాయపడాలని తపన తప్ప మిమ్మలను ఇబ్బంది పెట్టాలని ఆలోచన కాదండి.తలపెట్టిన పని కోసం నిత్యం తాపత్రయపడే వాడిని నేనండి.
కీర్తిశేషులు గౌరవ శ్రీ ఎన్టీఆర్ రామారావు గారిని మీ తండ్రి కీర్తిశేషులు గౌరవ శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని ప్రజలు దేవుడు లాగా భావించారండి.పేద వర్గాలకు మంచి చేసి మీరు కూడా ప్రజలచే ప్రేమించబడడానికి పునాదులు వేసుకోమని కోరుతున్నానండి.
దయచేసి మనసుపెట్టి రిజర్వేషన్లను కల్పించుటకు ఆలోచన చేసి మా పేద కాపులకు న్యాయం చేయమని కోరుతున్నానండి – ముద్రగడ పద్మనాభం.
.