టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు.అసలు ఆయన నిర్ణయాలన్ని ఆ స్థాయిలోనే ఉంటుంటాయి.2014లో టిఆర్ఎస్ ను మొదటిసారిగా అధికారంలోకి తీసుకురావడం, 2019 వరకు ప్రభుత్వం కొనసాగించే సమయం ఉన్నా, 2018 లోని ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్లారు.అనుకున్నట్టుగానే ముందస్తు ఎన్నికల్లో రెండోసారి టిఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకు రాగలిగారు.
ఇప్పుడు మరోసారి అదే ముందస్తు ఎన్నికలకు వెళ్లి మళ్లీ టిఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురావాలనే ప్లాన్ లో ఆయన ఉన్నట్లుగా ప్రస్తుత కెసిఆర్ వ్యవహార శైలి చూస్తే అర్దం అవుతోంది.ప్రస్తుతం కెసిఆర్ స్పీడ్ పెంచారు.
వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు.
అలాగే, రాష్ట్ర సచివాలయ ప్రారంభం, దళిత బందు ఇలా చెప్పుకుంటూ వెళ్తే పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు .వచ్చే ఏడాది మార్చి లోపు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రోడ్లకు మహర్దశ పట్టించేందుకు శ్రీకారం చుట్టారు.ఇక టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిన నిరుద్యోగ సమస్యల పైన కెసిఆర్ ప్లాన్ చేశారు.అసెంబ్లీలో ప్రకటించిన 80,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఇప్పుడు వేగవంతం చేశారు.ఇప్పటికే అనేక నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. దీంతో నిరుద్యోగులంతా టిఆర్ఎస్ విషయంలో సానుకూలంగా ఉన్నారు.
ఇక కెసిఆర్ సైతం తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా పర్యటనలు చేసేందుకు షెడ్యూల్ రూపొందిస్తున్నారు.డిసెంబర్ మొదటివారం నుంచి ఆయన తెలంగాణ వ్యాప్తంగా పర్యటన చేపడుతూ, అనేక బహిరంగ సభలు కూడా నిర్వహించబోతున్నట్లు సమాచారం.
ఈ సందర్భంగా తమకు ప్రధాన ప్రత్యర్థి గా మారిన బిజెపిని కట్టడి చేసేందుకు, ఆ పార్టీని , కేంద్రాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణ విషయంలో కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని, అందుకే టిఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు పార్టీ కీలక నాయకులు అందరి పైన దాడులకు దిగుతోందని, ఐటీ, ఈడి రైట్స్ పేరుతో భయపెట్టే ప్రయత్నం చేస్తుందని జనాలకు అర్థమయ్యే విధంగా వినూత్న కార్యక్రమాలు రూపొందించేందుకు ప్రణాళికలు రచిస్తోంది.ఇక మునుగోడు ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితం తమకు అనుకూలంగా ఉండడంతో ఆ పార్టీ మరింత ఉత్సాహంతో ఉంది.ముందస్తు ఎన్నికలకు వెళ్లి బిజెపి మరింత బలం పుంజుకోక ముందే, ఎన్నికలకు వెళ్లి సక్సెస్ అవ్వాలనే ప్లాన్ లో కేసిఆర్ ఉన్నారట.