మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలపై టిఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు.ఈ ఎన్నికల్లో గెలుపు సాధించడం ద్వారా, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ఎదురే ఉండదు అనే లెక్కల్లో కేసీఆర్ ఉన్నారు.
అందుకే కాంగ్రెస్, బిజెపికి అభ్యర్థులను ప్రకటించినా… కేసీఆర్ మాత్రం ఆచితూచి అభ్యర్థి ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఇప్పటికే టిఆర్ఎస్ నుంచి టికెట్లు ఆశిస్తున్న నేతల పరిస్థితులపై సర్వేలు నిర్వహించారు.
అలాగే మునుగోడు నియోజకవర్గంలో ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉంది ? ఏ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే గెలుపు దక్కుతుంది అనే అన్ని అంశాలపై ఎ ప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు.
అలాగే టికెట్ ఆశిస్తున్న వారి జాబితా కూడా ఎక్కువగా ఉండడంతో, నిన్ననే వారితో ప్రత్యేకంగా ప్రగతి భవన్ లో కేసీఆర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
దాదాపు మూడు గంటల పైగా జరిగిన చర్చల్లో అభ్యర్థులందరి వివరాలను పూర్తిగా పరిశీలించిన తరువాత సామాజిక వర్గాల లెక్కల ఆధారంగా కూసుగుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలి అనే లెక్కల్లో కేసీఆర్ ఉన్నారట.కాంగ్రెస్ బిజెపిలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను రంగంలోకి దించుతుండడంతో, టిఆర్ఎస్ తరఫున బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా, ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని, అలాగే ఈ నియోజకవర్గంలో బీసీల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అది తమకు కలిసి వస్తుందని కేసీఆర్ లెక్కలు వేసుకుంటున్నారట.

మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్రావు, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తదితరులతో నిర్వహించిన సమావేశంలో అనేక అంశాలపై చర్చించి, మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటించిన తర్వాత అభ్యర్థిని అధికారికంగా ప్రకటించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అంతకంటే ముందుగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి పూర్తిగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని , అలాగే ఏఏ వర్గాలు ప్రభుత్వంపై అసంతృప్తి ఉందో గుర్తించి వాళ్లలోని అసంతృప్తి ని పోగొట్టే విధంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని కేసీఆర్ దిశా నిర్దేశం చేశారట.ఏది ఏమైనా మునుగోడుపై కేసీఆర్ సైతం టెన్షన్ పడుతున్నట్టుగానే కనిపిస్తున్నారు.