తెలంగాణ బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న వ్యూహాలు రాజకీయ ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్నాయి.ఇప్పుడు మునుగోడు లో జరగబోయే ఉప ఎన్నికలతో పాటు, తెలంగాణలో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల పైన బిజెపి దృష్టి సారించింది.
ఈ మేరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో రాష్ట్రమంతా పర్యటన చేపడుతుండగా, హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే, చేరికల కమిటీ కన్వీనర్ ఈటెల రాజేందర్ ఇతర పార్టీల నుంచి బిజెపిలోకి చేరికలను ప్రోత్సహించే విషయంపైనే పూర్తిస్థాయిలో దృష్టి సారించారు.రాష్ట్రమంతా బిజెపిలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా ఎక్కడికక్కడ ఆయన వ్యూహాలు రచిస్తూ, కాంగ్రెస్ టిఆర్ఎస్ లకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ముఖ్యంగా రేపు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం లో జరగబోయే, కేంద్ర హోం మంత్రి అమిత్ షా భారీ లో పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.దీనిలో భాగంగానే పోరాటాల పురిటి గడ్డగా పేరుపొందిన వరంగల్ జిల్లా పై రాజేందర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ఒకవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతుండగా, ఈటెల రాజేందర్ కూడా ఈ జిల్లాపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు.ఈ జిల్లాలో కీలకంగా ఉన్న రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఇంట్లో జరిగిన ఈ భేటీలో ఈటెల రాజేందర్ తో పాటు, వరంగల్ హనుమకొండ జిల్లాల బిజెపి అధ్యక్షులు కొండేటి శ్రీధర్ రావు, పద్మ , బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీసీ కుల సంఘాలకు చెందిన అనేకమంది నాయకులతో సైతం ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది.

ప్రదీప్ రావు తో పాటు పెద్ద ఎత్తున నాయకులు బిజెపిలో చేరబోతున్నట్లు సమాచారం.ఒకపక్క మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల దృష్ట్యా, ఆ నియోజకవర్గంలో చేరికల పైన ఫోకస్ పెట్టడమే కాకుండా, ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా పైన రాజేందర్ దృష్టి పెట్టి అమిత్ షా సభలో తన సత్తా చాటాలని చూస్తున్నారు.