సాధారణంగా మన తెలుగు రాష్ట్రాలలో ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయి.ఈ క్రమంలోనే కొందరు విహార యాత్రలు చేస్తూ ఈ విధమైనటువంటి క్షేత్రాలను దర్శించుకుంటూ వుంటారు.
ఈ విధంగా సందర్శించాల్సిన ఆలయాలలో అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయాన్ని తప్పక దర్శించాలని చెప్పవచ్చు.ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి వారు రాతిపై ఏర్పడి కేవలం కుడి కన్నుతో మాత్రమే భక్తులకు దర్శనమిస్తూ వుంటారు.
ఈ విధంగా ఒకే కన్నుతో దర్శనమిచ్చే ఆలయ చరిత్ర ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.
అనంతపురం జిల్లాలోని గుంతకల్లు సమీపంలో కసాపురం అనే గ్రామంలో శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయం ఉంది.
ఇక్కడ వెలసిన స్వామివారిని నెట్టికంటి ఆంజనేయ స్వామి అని పిలుస్తారు.నెట్టి కంట అనగా ఓకే కన్ను కలవాడని అర్థం.అందుకోసమే ఈ ఆలయంలో వెలసిన స్వామివారిని నెట్టికంటి ఆంజనేయస్వామిగా పిలుస్తారు.ఎంతో పవిత్రమైన శ్రావణ మాసం కార్తీక మాసాలలో పెద్ద ఎత్తున భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి స్వామి వారి దర్శనం చేసుకుం టారు.
అనంతపురం జిల్లా నుంచి మాత్రమే కాకుండా ఇతర జిల్లాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.ఇక ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే.
పురాణాల ప్రకారం చిప్పగిరి గ్రామంలోని శ్రీ భోగేశ్వర స్వామి గుడిలో వ్యాసరయలవారు నిద్రిస్తుండగా వారి కలలోకి ఆంజనేయస్వామి వచ్చి నేను ఇక్కడ దక్షిణ దిక్కుగా కొద్దిదూరంలో భూమి లోపల ఉన్నాను.

నన్ను తిరిగి ప్రతిష్టించమని చెప్పారు.అదే విధంగా తన విగ్రహం పై ఒక వేప చెట్టు ఎండి పోయిందని, నీ రాకతో ఆ చెట్టు చిగురిస్తుందని సూచన కూడా చేశారు.ఈ క్రమంలోనే వ్యాసరాయలవారు స్వామివారు చెప్పిన దిశవైపు వెళ్తుండగా ఎండిపోయిన చెట్టు కనిపిస్తుంది.
అక్కడికి వ్యాసరాయలవారు చేరుకోగానే వేపచెట్టు చిగురించడంతో వ్యాసరాయలవారు అక్కడ తవ్వించి భూమిలోపల ఉన్నటువంటి స్వామివారి విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించారు.అయితేస్వామి వారి విగ్రహం కసాపురం గ్రామానికి సమీపంలో లభించటం వల్ల ఇక్కడ వెలసిన స్వామివారిని కసాపురం ఆంజనేయస్వామి అని కూడా పిలుస్తారు.
అప్పటినుంచి ఈ ఆలయానికి సందర్శించిన భక్తుల కోరికలను తీరుస్తూ ఉండటం వల్ల ఈ ఆలయానికి భక్తులతాకిడి అధికంగా ఉంది.ఈ క్రమంలోనే ఎంతో పవిత్రమైన మాసాలలో భక్తులు పెద్ద ఎత్తున ఈ ఆలయానికి చేరుకుని వారి మొక్కులు తీర్చుకుంటారు.