నైరుతి ఋతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి అని సంతోషించేలోపే, ఋతుపవనాల ప్రభావంతో గాలి, వాన భీభత్సం సృష్టించి ప్రజలని భయభ్రాంతులకి గురి చేస్తున్నాయి.ఎక్కడికక్కడ చెట్లు, కొండ చరియలు విరిగిపడుతున్నాయి.
మరో వైపు పట్టణాలలో భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయి.ఇదిలా ఉంటే తాజాగా రాజస్థాన్ లో గాలి, వాన భీభత్సం ఘోర ప్రమాదానికి కారణం అయ్యింది.
బాడ్‌మేర్ జిల్లాలో గుడారాలు కూలి 14 మంది సంఘటనా స్థలంలోనే మృతి చెందారు.మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తుంది.ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల సౌకర్యార్థం అక్కడ గుడారాలు ఏర్పాటు చేశారు.అయితే అనుకోకుండా వచ్చిన గాలి, వర్షం కారణంగా అవి కుప్పకూలడంతో పాటు, అదే సమయంలో విద్యుత్ వైర్లు తెగి పడటంతో ఊహించని స్థాయిలో ప్రమాదం సంభవించింది.
ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది.ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం.