యాదాద్రి భువనగిరి జిల్లా:ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలల్లో విద్యార్థులకు ఆయా విద్యా సంస్థలు పాఠ్యపుస్తకాలు విక్రయించరాదని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని బేఖాతర్ చేస్తూ దాదాపు ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ అధిక రేట్లకు పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్నారన్నది జగమెరిగిన సత్యం.విద్యా శాఖ అధికారుల పర్యవేక్షణ లోపమా? లేక వారితో ఉన్న లోపాయకారి ఒప్పందామా? తెలియదు కానీ,ప్రైవేట్,కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రతీ ఏటా ఇదే తంతును యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు.అడ్మిన్షన్ల దగ్గర నుండి మొదలు పెడితే ట్యూషన్ ఫీజులు,హాస్టల్ ఫీజులు,బస్సు,ఆటో ఫీజులు,కల్చరల్ ఫీజులు,బట్టలు,టై,బెల్ట్,షూ పేరుతో అదనంగా గుంజే ఫీజులు,ఇవి గాక పాఠ్యపుస్తకాలు,నోట్ బుక్స్ కూడా వారే విక్రయిస్తూ వేలవేలకు డబ్బులు వసూలు చేస్తూ,మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాల రక్తం జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నారు.అయినా ఇవేవీ విద్యా శాఖ అధికారులకు కనిపించకపోవడం గమనార్హం.
ఇలాంటి సంఘటనే యాదాద్రి జిల్లాలోని వలిగొండ మండల కేంద్రంలో బుధవారం వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళితే వలిగొండ మండల కేంద్రంలో పవిత్రాత్మ ప్రైవేట్ హైస్కూల్ లో అపవిత్రంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల ఆవరణలోనే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను విక్రయిస్తున్నారు.
ఈ విషయాన్ని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు మండల ఎంఈఓ వేపూరి శ్రీధర్ పాఠశాలలో తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల సమయంలో పాఠశాల ఆవరణలోని గదిలో భద్రపరిచిన పాఠ్యపుస్తకాలను గుర్తించి,గదికి తాళంవేసి సీజ్ చేశారు.ఈ సందర్భంగా ఎంఈఓవ్ మాట్లాడుతూ మండలంలో ఏ ప్రైవేట్ పాఠశాలలో అయినా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు విక్రయించినా,ప్రభుత్వ నిబంధనలు విస్మరించినా ఆ పాఠశాలలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పని చేసే ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలలను సీజ్ చేయడం కాదని,వాటి గుర్తింపును పూర్తిగా రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.