తెలంగాణలో బలపడేందుకు బిజెపి చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు.టిఆర్ఎస్ వరుసగా రెండు సార్లు అధికారంలోకి రావడంతో మూడోసారి అధికారంలోకి రావడం కష్టమని, ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందని బిజెపి బలంగా నమ్ముతోంది.
అందుకే టిఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని పెద్ద ఎత్తున విమర్శలకు దిగడంతో పాటు, టిఆర్ఎస్ ను టార్గెట్ గా చేసుకుని అనేక వ్యూహాలను రచిస్తున్నారు.దీనికి కేంద్ర బిజెపి పెద్దలు సైతం మద్దతు పలుకుతూ ఉండడంతో, తెలంగాణ బిజెపి నాయకులు మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నారు.
ఈ క్రమంలోనే బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలను తెలంగాణలో నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా తో పాటు, 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనబోతూ ఉండడంతో ఆ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణలో బిజెపి బలాన్ని నిరూపించేందుకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను తెలంగాణ లో ఏర్పాటు చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సమావేశాలకు సంబంధించిన సమగ్ర ప్రణాళికను రూపొందించారు.
వాటిని విజయవంతం చేసే విధంగా కమిటీలను ఏర్పాటు చేశారు.ఆ కమిటీలు సూచనలు, సలహాలతో ఈ సభను సక్సెస్ చేయాలని చూస్తున్నారు.
ఈ నెల 30వ తేదీన హైదరాబాద్ కు బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా రానున్నారు.దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
అలాగే జులై 1వ తేదీన హెచ్ ఐ సి సి లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించనున్నారు.దీనికి సంబంధించిన సూచనలను చేయనున్నారు.జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో చర్చించిన తీర్మానాలను పార్టీ ఫైనల్ చేయబోతోంది.2 ,3 తేదీల్లో జరిగే సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు.
జూలై 2 న జాతీయ పార్టీ ఆఫీస్ బేరర్ ల సమావేశం నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా పార్టీ అనుసరించాల్సిన విధానంపై తగిన సూచనలు చేస్తారు.మూడో తేదీన నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ నిర్వహిస్తారు.ఈ సందర్భంగా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించిన తీర్మానాలను ఆమోదించనున్నారు.అలాగే ఎనిమిదేళ్ల బీజేపీ పాలన పై ధన్యవాద తీర్మానం ప్రవేశ పెట్టాలని పార్టీ నిర్ణయించింది.4న హెచ్ఐసిసిలో పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ సమావేశాన్ని నిర్వహించనున్నారు.నిన్న కాచిగూడ పటేల్ గన్ శ్యామ్ భవన్ లో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ వివిధ రాష్ట్రాలకు చెందిన నాయకులతో భేటీ అయ్యారు.బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో 18 బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తున్న నేపథ్యంలో ఆయా కుల సంఘ నాయకులకు ఆ సామాజిక వర్గాలకు చెందిన ముఖ్యమంత్రులతో సమావేశం అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
మొత్తంగా తెలంగాణలో ఓటు బ్యాంకు పెంచుకునేందుకు బిజెపి ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలను బాగానే ఉపయోగించుకోబోతోంది.