చాలా మంది విహార యాత్రలు వెళ్తుంటారు.దేశంలోని వివిధ అందమైన ప్రదేశాలకు ఒక్కసారైనా వెళ్లాలని భావిస్తుంటారు.
అక్కడి సుందరమైన దృశ్యాలను చూస్తూ మైమరచిపోతారు.కొండలు ఎక్కి, కిందికి చూస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంటారు.
ఇలాగే విహార యాత్రకు వెళ్లిన కొందరు పర్యాటకులకు భయంకరమైన అనుభవం ఎదురైంది.కొండపై నుంచి కిందకు రాకపోకలు సాగించే కేబుల్ కారు ఎక్కగా అది మధ్యలో నిలిచిపోయింది.
దీంతో త్రిశంకు స్వర్గంలో మాదిరిగా గాలిలోనే వారు ఉండిపోయారు.ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తమను రక్షించాలని హాహాకారాలు చేస్తున్నారు.
దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
హిమాచల్ ప్రదేశ్ అనగానే కొండలు, లోయలు, వాటి మధ్య టూరిస్టు స్పాట్లు మన కళ్ల ముందు మెదులుతాయి.
ఇక్కడ పర్వానూ టింబర్ ట్రయల్ పరిధిలో కొందరు పర్యాటకులు సోమవారం కేబుల్ కారు ఎక్కారు.అయితే మధ్యలోనే సాంకేతిక లోపంతో అది నిలిచిపోయింది.ఒక్కసారిగా వారు భయంతో కేకలు వేశారు.అప్రమత్తమైన కేబుల్ కార్ సిబ్బంది వారిని రక్షించే మార్గం కోసం అన్వేషణ ప్రారంభించారు.
విషయం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.

ఒక్కొక్కరిగా మొత్తం 11 మందిని కాపాడారు.ఇంకా చాలా మంది కేబుల్ కారులో చిక్కుకుపోయారు.వారందరినీ సురక్షితంగా కిందికి తీసుకొచ్చేందుకు అంతా శ్రమిస్తున్నారు.
ప్రస్తుతం చిక్కుకుపోయిన వారంతా క్షేమంగానే ఉన్నారని, వారిని కాపాడే ప్రయత్నాలు సాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు.సాంకేతిక లోపం కారణంగానే ఈ పరిస్థితి ఎదురైందని వారు చెబుతున్నారు.