టీబీ( TB ) అంటే మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్( Mycobacterium Tuberculosis ) అనే బ్యాక్టీరియాతో కలిగే అంటువ్యాధి.దీనిని క్షయవ్యాధి అని కూడా పిలుస్తారు.
ప్రతి సంవత్సరం ఈ రోజు(మార్చి 24)న ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం జరుపుకుంటారు.టీబీ వ్యాధిని అరికట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచే ఉద్దేశంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
టీబీ ప్రమాదకరహా.? అసలు వ్యాధి లక్షణాలు ఏంటి.? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
టీబీ వ్యాధి ప్రాముఖ్యంగా ఊపిరితిత్తులను( Lungs ) ప్రభావితం చేస్తుంది.
ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది.టీబీ ఉన్న వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు బయటికొచ్చే బాక్టీరియాను శ్వాస ద్వారా ఆరోగ్యవంతులైన వ్యక్తులు పీలిస్తే వ్యాధి సోకే అవకాశం ఉంటుంది.
టీబీ వ్యాధి లక్షణాలు విషయానికి వస్తే.కొన్నివారాలపాటు నిరంతరం దగ్గు( Cough ) వస్తూ ఉంటుంది.
రాత్రివేళ అధికంగా చమటలు పట్టడం, ఒళ్లు నొప్పులు, అలసట, జ్వరం, గాలి పీల్చుకోవడం కష్టమవడం, శరీర బరువు తగ్గిపోవడం, ఆకలి లేకపోవడం, గొంతు మరియు ఛాతిలో నొప్పి వంటివి కూడా టీబీ లక్షణాలే.వ్యాధి మరింత ముదిరితే రక్తం కలిసిన దగ్గు కూడా వస్తుంది.

ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ బ్యాక్టీరియా ఊపిరితిత్తుల నుంచి ఇతర అవయవాలను ప్రభావితం చేస్తుంది.మెదడును ప్రభావితం చేస్తే తలనొప్పి, మతిస్థిమితం కోల్పోవడం వంటివి తలెత్తుతాయి.కిడ్నీలు, కాలేయాన్ని ప్రభావితం చేస్తే మూత్రంలో రక్తం, ఛాతి లోపలి నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.ఎముకలను ప్రభావితం చేస్తే వెన్నుపాము నొప్పి, కీళ్ల నొప్పులు ఏర్పడతాయి.

కాబట్టి, సుమారు 2 వారాల పాటు దగ్గు ఉంటే తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి.ప్రాధమిక దశలోనే గుర్తిస్తే జబ్బు పూర్తిగా నయం అవుతుంది.టీబీ నిర్థారణ అయినవారు ఆరు నుంచి తొమ్మిది నెలలపాటు పూర్తి మందుల కోర్సు పూర్తి చేయాలి.శరీర రోగనిరోధక శక్తిని మెరుగుపరిచే ఆహారం తీసుకోవాలి.విశ్రాంతి, శుభ్రత పాటించాలి.ఒకవేళ సరైన సమయంలో గుర్తించకుండా, చికిత్స తీసుకోకుండా వదిలేస్తే టీబీ వ్యాధి ప్రాణాంతకంగా మారవచ్చు.