ఆనంద్ మహీంద్రా పరిచయం నేటి యువతకు అక్కర్లేదు.సోషల్ మీడియా పుణ్యమాని ఇలాంటి పుణ్యాత్ముల గురించి ఇట్టే తెలుసుకుంటున్నారు.
మహీంద్రా డబ్బున్న మనిషే కాదు, అంతకంటే మంచి మనసున్న వ్యాపారవేత్త కూడా.ఇక ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్న విషయం తెలిసినదే.
దేశంలో జరిగిన వివిధ సంఘటనపైన ఆయన తన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూనే వుంటారు.ఈ రకంగానే ఆయనంటే ఎక్కువగా సమాజానికి తెలిసింది.
మంచి సామాజిక స్పృహ వున్న మనిషి ఆనంద్ మహీంద్రా.తాజాగా ఆయన పెట్టిన ట్వీట్ అందరిని దృష్టిని ఆకర్షిస్తోంది.
భారత జట్టు ఇటీవల థామస్ కప్‌ని గెలిచి బ్యాడ్మింటన్‌లో చరిత్ర సృష్టించిన సంగతి మనకు తెలిసిందే.చిరాగ్ శెట్టి – సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి డబుల్స్ జోడీ జట్టు విజయంతో ఇండియన్ బ్యాడ్మింటన్ కెరీర్ లో ఓ అద్భుతం జరిగింది.
ఈ నేపథ్యంలో భారత జట్టును ప్రశంసిస్తూ, ఆనంద్ మహీంద్ర ట్విటర్‌లో పోస్ట్ పెట్టారు.దీనికి చిరాగ్ శెట్టి స్పందిస్తూ.ధన్యవాదాలు తెలిపాడు.అంతేకాదు తాను ఇటీవల మహీంద్రా కంపెనీకి చెందిన ఎస్‌యూవీ 700 కారు బుక్ చేశానని, కాస్త తొందరగా డెలివరీ చేయాలని అభ్యర్థించాడు.
దీనికి ఆనంద్ మహీంద్రా తనదైన శైలిలో జవాబు ఇచ్చారు.కాగా ఈ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆయన దానికి రిప్లయ్ ఇస్తూ, “ఛాంపియన్‌ల ఎంపికగా మారిన SUV 700ని వీలైనంత త్వరగా మీకు అందజేయడానికి మేము కృషి చేస్తున్నాం.నా భార్య కోసం నేను కూడా ఒకటి ఆర్డర్ చేసాను.అయితే నేను ఇప్పటికే క్యూలోనే ఉన్నాను” అంటూ సరదాగా సమాధానం ఇచ్చారు.కరోనా సంక్షోభంతో ప్రపంచ వ్యాప్తంగా చిప్‌సెట్ల కొరత ఏర్పడటంతో కార్ల తయారీ కంపెనీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
కొత్త కార్లు తయారు చేయడానికి కంపెనీలకు చాలా సమయం పడుతోంది.దీంతో బుకింగ్‌లు ఉన్నప్పటికీ కార్లను డెలివరీ చేయలేక కంపెనీలు సతమతమవుతున్నాయి.అటు వినియోగదారులు కూడా కొత్త కార్ల కోసం సుదీర్ఘ సమయం ఎదురు చూడాల్సి వస్తోంది.