రోడ్డు విస్తరణ పేరిట అడ్డగోలుగా భూసేకరణ జరిపిన, రైతుల నుంచి బలవంతంగా భూమి సేకరించిన ఊరుకునే ప్రసక్తేలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ప్రజా సమస్యల పరిష్కారంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు గారు చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సోమవారం చింతకాని మండలం కొదుమూరు నుంచి వందనం, రాఘవపురం, లచ్చగూడెం, నేరడ గ్రామాల్లో కొనసాగింది.
రాత్రికి నేరడ గ్రామంలో బస చేస్తారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పెద్దఎత్తున జనాలు రోడ్లపైకి వచ్చి పాదయాత్రకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు.
ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ అభివాదం చేస్తూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రను కొనసాగించారు.అనంతరం ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభలలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
తల్లితో పెనవేసుకున్న అనుబంధం వలె భూమిని నమ్ముకున్న ప్రజలకు దానితో విడదీయలేని బంధం ఉంటుందన్న విషయాన్ని పాలకులు గ్రహించి రైతులను ఒప్పించి మెప్పించి ప్రేమపూర్వకంగా భూసేకరణ చేయాలన్నారు.బెదిరింపులు చేసి బలవంతంగా గుంజుకోవాలని చూస్తే మధిర నియోజకవర్గంలో వారి ఆటలు సాగనివ్వనని వెల్లడించారు.
గ్రీన్ ఫీల్డ్, అమరావతి- పూనా రోడ్స్ ఏర్పాటు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన 2013 భూ సేకరణ చట్టం ప్రకారం గా భూములు సేకరించాలని ప్రభుత్వానికి సూచించారు.ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరలకు మూడు రెట్లు ఎక్కువ ధర చెల్లించి రైతుల అంగీకారంతో భూ సేకరణ చేయాలని అధికారులకు సూచించారు.
అడ్డగోలుగా భూసేకరణ చేస్తే కచ్చితంగా తాను ప్రజల పక్షాన ముందుండి అడ్డుకుంటానని వెల్లడించారు.పారదర్శకంగా 2013 భూ సేకరణ చట్టం ప్రకారంగా నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లాలని తెలిపారు.