రాజకీయంగా తెలంగాణలో కీలకం అయ్యేందుకు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు .ప్రతి విషయం పైన ఆమె స్పందిస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు.
పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు ప్రోత్సహించి బలమైన పార్టీగా వైఎస్సార్ తెలంగాణ పార్టీని తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.దీనిలో భాగంగానే ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపట్టడంతో పాటు, కొద్ది నెలల క్రితం పాదయాత్ర సైతం ఆమె చేపట్టారు ప్రస్తుతం ఈ యాత్రకు విరామం ప్రకటించినా , దాన్ని తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అయినా షర్మిల పార్టీకి ఆశించినస్థాయిలో అయితే జనాలు నుంచి రాజకీయ వర్గాల నుంచి ఆదరణ అయితే వస్తున్నట్టుగా కనిపించడం లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు షర్మిల పార్టీకి మరో చిక్కు వచ్చి పడింది.
ఎప్పుడో ఎన్నికల సంఘం గుర్తింపు కోసం దరఖాస్తు చేశారు.జూలై 9న అధికారికంగా సభ పెట్టి మరి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ప్రకటించినా, ఇప్పటికీ ఎన్నికల సంఘం ఆ పార్టీని గుర్తించలేదు.
దీనికి అనేక కారణాలు ఉన్నాయి.ఆమె పార్టీ ని గుర్తించ వద్దని వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు షేక్ బాషా ఢిల్లీ కోర్టులో ఫిర్యాదు చేయడం , ఎన్నికల సంఘానికి కూడా పార్టీకి గుర్తింపు ఇవ్వడంపై తమకు అనేక అభ్యంతరాలు ఉన్నాయని, ఫిర్యాదు చేయడం ఇప్పటికే వైయస్సార్ పేరుతో పార్టీలో ఉన్న నేపథ్యంలో మరో కొత్త పార్టీ అదే పేరుతో రావడం వల్ల జనాల్లోగందరగోళం నెలకొంటుందని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఇక అప్పటి నుంచి ఎన్నికల సంఘం షర్మిల పార్టీకి గుర్తింపు ఇవ్వడం లేదు.ఈ వ్యవహారంపై షర్మిల తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ స్థాపించి ఏడాదైనా ఇప్పుడు వరకు తమ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు ఇవ్వకపోవడం , దానికి సరైన కారణాలు చెప్పకపోవడం పై షర్మిల అసంతృప్తి తో ఉన్నారు.ఈ వ్యవహారాన్ని ఎన్నకల సంఘం వద్దనే తేల్చుకోవాలని షర్మిల డిసైడ్ అయ్యారు.తన తండ్రి వైఎస్సార్ పేరుతో పార్టీ పెట్టుకున్నామని , ఈ విషయంలో వైఎస్ఆర్ భార్య తమ తల్లి విజయలక్ష్మి నుంచి ఎటువంటి అభ్యంతరాలు లేవని సర్టిఫికేట్ సమర్పించినా ఎన్నికల సంఘం ఎందుకు ఇంకా గుర్తింపు ఇవ్వడం లేదు అంటూ నిరసన తెలియజేశారు.ఎన్నికల నాటికి ఎన్నికల సంఘం గుర్తింపు రాకపోతే ఏం చేయాలనే విషయంపైన ఇప్పుడు షర్మిల దృష్టిసారించారట.