ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (యూ.పీ.
హెచ్.సీ) ఔట్ సోర్సింగ్ సిబ్బంది తొలగించడం సరైన నిర్ణయం కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 1700 మంది ఉద్యోగులను విధుల నుంచి దూరం చేయడం అత్యంత బాధాకరం అన్నారు.ఆదివారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో.ఏళ్ల తరబడి ఆరోగ్య కేంద్రాల్లో నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఏఎన్ఎంలు, ఫార్మాసిస్టులుగా నిర్వహిస్తున్న వారిని ఒక్కసారిగా రోడ్డున వేశారని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ప్రతినిధులు అంశాన్ని తన దృష్టికి తీసుకు వచ్చారని పేర్కొన్నారు.
పేదలకు వైద్యసేవలు అందిస్తున్న సిబ్బందిని తొలగించడం తీవ్రమైన అంశమని ఖండించారు.కరోనా ఉద్ధృతి సమయంలో ఆరోగ్య కేంద్రాల సిబ్బంది ఎంతో ధైర్యంగా విధులు నిర్వహించారని కష్టాలు ఎదురైనా ముందుకు సాగారన్నారు.
టెస్టింగ్ ల నుంచి వ్యాక్సినేషన్ వరకు ఎన్నో కీలక విధులు నిర్వర్తించారని అందుకు తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఉద్యోగ భద్రత లేకుండా చేయడం భావ్యం కాదని అన్నారు.ఈ నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించారు.
ఔట్ సోర్సింగ్ కు సంబంధించి మరో ఏజెన్సీకి బాధ్యతలు అప్పగిస్తే పాత వారికి పనిలేదని చెప్పడంలో ఏమాత్రం అర్థం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఏజెన్సీ మారితే ఉపాధి పోతుందా.అని వారి కోసం ఉద్యోగాలను బలి చేస్తారా అని నిలదీశారు.లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీలు ఇచ్చారని అయితే ఇప్పుడు ఉద్యోగుల సేవలను ఎలా నిలిపిచేస్తారు అని ధ్వజమెత్తారు.
ఆరోగ్య కేంద్రాల్లో అనుభవమున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను యధావిధిగా ఉద్యోగాల్లో కొనసాగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఔట్ సోర్సింగ్ సిబ్బందికి తమ పార్టీ అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు.