రాష్ట్రానికి ఐపీఎస్ ల సంఖ్య పెంచండి.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఢిల్లీ పర్యటనలో భాగంగా శనివారం మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిశారు.
ఈ సందర్భంగా ఆయన రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై అమిత్ షాతో చర్చించారు.ముందుగా మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రెండేళ్ల తర్వాత జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగిందని దాంతో కొత్త జిల్లాలు, కొత్త జోన్లు, కొత్త మల్టీ జోన్లు ఏర్పడ్డాయని దానికి తగినట్టే పోలీస్ శాఖలో మార్పులు జరిగాయన్నారు.గతంలో 9 జిల్లా పోలీస్ కార్యాలయాలు, 2 పోలీస్ కమిషనరేట్ లు ఉండేవని, ప్రస్తుతం పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలో విభజన జరిగినట్లు వివరించారు.
కొత్త 20 జిల్లా పోలీస్ కార్యాలయాలు 9 కమిషనరేట్ లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఐపీఎస్ల సంఖ్య పెంచాలని కోరారు పోలీస్ శాఖ లో జరిగిన మార్పుల వల్ల సీనియర్ డ్యూటీ పోస్టుల సంఖ్య 75 నుంచి 105 పెరిగిందని ఐపీఎస్ కేడర్ పోస్టులు కూడా 139 నుంచి 195కు పెరిగాయని సీఎం కేసీఆర్ కేంద్ర హోం శాఖ మంత్రికి తెలిపారు.ఈ నేపథ్యంలో పటిష్టమైన పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు పరిపాలన నిర్వహణ అనుగుణమైన రీతిలో ఐపీఎస్ ల సంఖ్య పెంచాలని సీఎం కేసీఆర్ కోరారు.పోలీసు ఆఫీసర్ లకు సంబంధించిన అంశాన్ని కేంద్ర హోంశాఖ తెలియజేస్తానని కొత్త కమిషనర్లు, డీఐజీలు, ఎస్పీలు, ఐజీపీలు అవసరం ఉందని సీఎం తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అవసరాన్ని ప్రత్యేక కేసుగా పరిగణించి ఐపీఎస్ క్యాడర్ సమీక్ష నిర్వహించాలని తద్వారా అవసరమైన ఆఫీసర్లు కేటాయించాలని సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.కొత్తగా 29 సీనియర్ డ్యూటీ పోస్టులతో పాటు గా మొత్తం 195 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని వినతి పత్రంలో కోరారు.