ప్రపంచంలోని రాజకీయ విశ్లేషకుల్ని ఏకంగా అగ్రరాజ్యం అమెరికా అంచనాలను తలక్రిందులు చేస్తూ తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను హస్తగతం చేసుకున్నారు.కనీసం పోరాటం చేయకుండానే సైన్యం తాలిబన్ల ముందు మోకరిల్లగా.
ఊకదంపుడు ఉపన్యాసాలు చేసిన అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశాన్ని వదిలి పారిపోయాడు.ఆయనతో పాటు మంత్రులు, స్పీకర్, ఇతర ఉన్నతాధికారులు సైతం ఆఫ్ఘనిస్తాన్‌ను విడిచి వెళ్లిపోయారు.
వాళ్లే అలావుంటే ఇక సామాన్యుల సంగతి చెప్పనక్కర్లేదు.రెండు దశాబ్ధాల క్రితం తాలిబన్ల అరాచక పాలనను గుర్తుకు తెచ్చుకున్న జనం వెంటనే దేశాన్ని విడిచి వెళ్లాలనే ఉద్దేశంతో కాబూల్ విమానాశ్రయానికి పోటెత్తారు.
ఏ విమానం కనపడితే ఆ విమానం ఎక్కేందుకు ఎగబడ్డారు.ఒకానొక సమయంలో ప్రజలను అదుపు చేసేందుకు గాను అమెరికా సైన్యం కాల్పులు జరపాల్సి వచ్చింది.
అలాగే విమానంలో చోటు లేకపోవడంతో పలువురు ఫ్లైట్ రెక్కలు, టైర్లను పట్టుకుని ప్రయాణం చేయాలనుకున్నారు.ఈ క్రమంలో పలువురు గాల్లోనే కిందపడి దుర్మరణం పాలయ్యారు.
ఇంత జరుగుతున్నప్పటికీ అక్కడి వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయంలో పూజారిగా ఉన్న పండిత్ రాజేష్ కుమార్ మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫ్ఘనిస్థాన్‌ను వదిలేదని తేల్చి చెప్పారు.తాలిబన్లు చంపితే చంపనీ.
వాళ్లు చంపినా అది నా సేవలాగే భావిస్తా అని ఆయన స్పష్టం చేశారు.రతన్‌నాథ్ ఆలయంలో రాజేష్ కుమార్ పూజారిగా వ్యవహరిస్తున్నారు.
ఆయనే కాదు కొన్ని వందల ఏళ్లుగా ఆయన పూర్వీకులు కూడా ఆ ఆలయ సేవలోనే ఉన్నారు.అలాంటి ఆలయాన్ని ఇలాంటి పరిస్ధితుల్లో వదిలేసి వెళ్లనని రాజేష్ అంటున్నారు.
కొంతమంది హిందువులు తనను కాబూల్ విడిచి వెళ్లమన్నారని.వాళ్లే నా ప్రయాణానికి, వసతికి ఏర్పాట్లు చేస్తామన్నారు.
కానీ ఈ ఆలయంలో నా పూర్వీకులు వందల ఏళ్లుగా సేవ చేశారని.తాను ఈ గుడిని వదల్లేనని రాజేశ్ కుండబద్ధలు కొట్టారు.
మరోవైపు ఆఫ్గానిస్థాన్ నుంచి భారత అధికారులు స్వదేశానికి చేరుకున్నారు.రాయబార కార్యాలయ అధికారులు, ఇతర సిబ్బందితో కాబుల్ నుంచి బయల్దేరిన వాయుసేన ప్రత్యేక విమానం ఈ ఉదయం 11.15 గంటల ప్రాంతంలో గుజరాత్‌లోని జాంనగర్ ఎయిర్‌బేస్‌కు క్షేమంగా వచ్చింది.ఈ సి-17 విమానంలో 120 మందికి పైగా రాయబార కార్యాలయం, భద్రతా విభాగం అధికారులు, సిబ్బంది ఉన్నారు.
కొందరు భారత పౌరులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.సొంతగడ్డపై అడుగుపెట్టగానే వారంతా భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.