అమెరికాను పెను విషాదంలోకి నెట్టిన కోవిడ్ వైరస్‌ను నియంత్రించేందుకు వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని ప్రజలు ఎదురుచూశారు.నిద్రాహారాలు మాని, రాత్రిపగలు శాస్త్రవేత్తలు పడిన కృషికి ప్రతిఫలంగా టీకా అందుబాటులోకి వచ్చింది.
నాటి నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అగ్రరాజ్యం విజయవంతంగా అమలు చేస్తోంది.ఇంత జరుగుతున్నా ప్రజల్లో ఏదో భయం, ఏదో అనుమానం.
టీకా తీసుకోవడం మంచిదేనా, ఏమైనా దుష్పరిణామాలు వస్తే పరిస్ధితేంటీ అన్న ఆందోళన పలువురిని వెంటాడుతోంది.అయితే ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం, సెలబ్రెటీలు, స్వచ్ఛంద సంస్థలు ఎంతగానో కృషి చేస్తున్నాయి.
అధికారంలోకి వస్తూనే కరోనా అంతమే తన మొదటి లక్ష్యయమన్నారు జో బైడెన్.అందుకు తగ్గట్టుగానే 100 రోజుల్లో 10 కోట్ల డోసుల టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.అధికార యంత్రాంగం సమర్థంగా పనిచేయంతో.మార్చి 25 నాటికి, అంటే 64 రోజుల్లోనే ఆ లక్ష్యాన్ని అందుకున్నారు.
దీంతో బైడెన్ తన లక్ష్యాన్ని 20 కోట్లకు పెంచారు.దాన్ని కూడా 10 రోజుల ముందే.
అంటే 90 రోజుల్లోనే ఛేదించారు.ఫలితంగా.ఒకప్పుడు రోజుకు 3.07 లక్షల కేసులు, రోజుకు దాదాపు 4,500 మరణాలతో వణికిపోయిన అమెరికా ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటోంది.కానీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత విస్తరించి, జూలై 4 నాటికి దేశాన్ని కరోనా ఫ్రీగా చేయాలని బైడెన్ కంకణం కట్టుకున్నారు.

కానీ వ్యాక్సినేషన్‌పై ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదని గణాంకాలు చెబుతున్నాయి.మిలియన్ డాలర్ల విలువ చేసే లాటరీలు.ఉచిత బీర్లు.
మారిజువానా షాట్లు.రైఫిళ్లు.
ఇలా ఎన్ని ఆఫర్లు ప్రకటించినా కొంత మంది మాత్రం టీకా తీసుకునేందుకు ససేమిరా అంటున్నారు.ఇప్పుడే కాదు.
రానున్న రోజుల్లో కూడా తాము టీకా వేయించుకునేది లేదని తేల్చిచెబుతున్నారు.దీంతో.
టెన్నెసీ, నార్త్ కరోలినా వంటి రాష్ట్రాలు తమ వద్ద మిగిలిపోయిన వ్యాక్సిన్ డోసులను కేంద్ర ప్రభుత్వానికి తిరిగి పంపుతున్నాయి.
భారత్ వంటి దేశాల్లో టీకాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో కొట్లాడుతుంటే.
అమెరికాలో మాత్రం కావాల్సిన దానికన్నా ఎక్కువే టీకాలు వున్నాయి.జనం వ్యాక్సిన్లు వేయించుకోవడాన్ని పక్కనబెడితే.
ఇప్పుడు ప్రభుత్వానికి మరో కొత్త సమస్య వచ్చి పడింది.అదే వాటి ఎక్స్‌పైరీ.
కరోనా నుంచి దేశాన్ని బయటపడేయాలని నిర్ణయించుకున్న మాజీ అధ్యక్షుడు ట్రంప్.టీకాల కోసం గత ఏడాదే పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు.ఆ కంపెనీలు వ్యాక్సిన్ తయారు చేసేందుకు రూ.75 వేల కోట్ల ఆర్ధిక సాయం మేర అందించారు.ఆయన కృషి ఫలించి గత డిసెంబరు నాటికే టీకాలు అందుబాటులోకి వచ్చాయి.

అయితే ఏప్రిల్ రెండోవారం నాటికి రోజుకు సగటున 33 లక్షల డోసుల టీకాలు వేసిన అమెరికా ఇప్పుడు రోజుకు సగటున 8.7 లక్షల డోసులు కూడా ఇవ్వలేకపోతోంది.సీడీసీ గణాంకాల ప్రకారం ఇప్పటిదాకా అమెరికాలో 18 ఏళ్లు పైబడిన వారిలో 64 శాతం మంది కనీసం ఒక డోసు టీకా వేయించుకున్నారు.
మిగిలిన వారిలో కొందరు మాత్రమే టీకా వేసుకునేందుకు రెడీగా వుండగా… ఎక్కువ మంది నో అనడం సమస్యగా మారింది.మరి ఈ ఇబ్బందిని బైడెన్ ఏ రకంగా పరిష్కరిస్తారో వేచి చూడాలి.