తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరు పార్టీ అధినేత చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా అది తు.చ తప్పకుండా అమలు అయ్యేది.
ఎవరైనా పార్టీ గీత దాటాలి అన్నా, ఎవరు సాహసించేవారు కాదు.అయితే చాలా కాలంగా పార్టీలో క్రమశిక్షణ అదుపు తప్పుతోందని, అధినేత చంద్రబాబు మాటలను సైతం పట్టించుకునే పరిస్థితుల్లో నాయకులు లేరు అనే చర్చ చాలా కాలం నుంచి నడుస్తూ వస్తోంది.
మరి కొంతమంది నాయకులు చంద్రబాబు ఆదేశాలను పట్టించుకోకపోగా, ఆయనపై బెదిరింపులకు దిగుతూ, తమ పంతం నెరవేర్చుకుంటూ వస్తుండడం పైన అనేక చర్చలూ నడుస్తూనే ఉన్నాయి.ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం ఏపీలో పంచాయతీ , మున్సిపల్ ఎన్నికల ఫలితాలు పూర్తిగా టిడిపిని నిరాశకు గురి చేయడంతో పరిషత్ ఎన్నికలకు దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది.
పొలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.దీంతో పరిషత్ ఎన్నికల లో అభ్యర్థుల ప్రచారానికి దూరం అవ్వాలని, పార్టీ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి.కానీ ఎక్కడా ఆ ఆదేశాలను పట్టించుకోవడం లేదు అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది .అనేక చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ తెలుగు తమ్ముళ్లు పరిషత్ ఎన్నికల్లో తలపడేందుకు హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.అయితే ఈ విషయంపై ఏపీ టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు స్పందించారు.
ఎవరైనా పార్టీ అధినేత ఆదేశాలను పాటించాల్సిందే అంటూ చెబుతున్నారు.
కాకపోతే చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలోనూ టీడీపీ అభ్యర్ధి ప్రచారం నిర్వహిస్తుండడం తో బాబు మాట రాష్ట్రవ్యాప్తంగా ఎవరూ పట్టించుకోకపోయినా, సొంత నియోజకవర్గంలోని నాయకులూ పట్టించుకోకపోవడం తో పార్టీలో క్రమశిక్షణ ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది.అసలు పరిషత్ ఎన్నికలకు దూరంగా ఉండాలని బాబు నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మక తప్పిదం అనే అభిప్రాయం సర్వత్రా నెలకొంది.