ఈ మధ్య కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెళ్లి చేసుకునే అమ్మాయిలకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో కొత్త స్కీమ్ లను అమలు చేస్తున్నాయి.సామాన్య, మధ్యతరగతి కుటుంబాలలో పెళ్లి చేసుకునే అమ్మాయిల వల్ల కుటుంబంపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి.
ఏపీలో వైయస్సార్ పెళ్లి కానుక తెలంగాణలో కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ పథకాల ద్వారా పెళ్లి చేసుకునే అమ్మాయిలకు ప్రభుత్వాలు నగదు జమ చేస్తున్నాయి.అయితే పలు సందర్భాల్లో నగదు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది.
అందువల్ల అస్సాం రాష్ట్ర ప్రభుత్వం పెళ్లి చేసుకునే అమ్మాయిలకు ఉచితంగా తులం బంగారం ఇవ్వడానికి సిద్ధమైంది.అరుంధతి స్వర్ణ యోజన పేరుతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది.
తులం బంగారం 52,000 రూపాయలు పలుకుతున్న తరుణంలో బంగారం ఇవ్వడం వల్ల పెళ్లి ఖర్చు తగ్గించాలని అస్సాం ప్రభుత్వం భావిస్తోంది.
అస్సాం ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ స్కీమ్ పట్ల ఆ రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ పథకానికి అర్హత సాధించాలంటే కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి.18 సంవత్సరాల వయస్సు దాటిన పెళ్లిని రిజిష్టర్ చేసుకున్న యువతులు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.5 లక్షల రూపాయల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలు మాత్రమే ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
అస్సాంలో బాల్యవివాహాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ స్కీమ్ అమలు ద్వారా వాటికి కూడా చెక్ పెట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
ఇతర రాష్ట్రాలకు భిన్నంగా అస్సాం ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ స్కీమ్ అక్కడ సక్సెస్ అయితే మిగతా రాష్ట్రాలు కూడా ఇదే దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది.అస్సాం సర్కార్ అమలు చేస్తున్న ఈ స్కీమ్ ను నెటిజన్లు సైతం ప్రశంసిస్తున్నారు.