రాజకీయాల్లో ఓడలు బళ్లు, బళ్లు ఓడలు అవ్వడం అనేది సర్వ సాధారణంగా జరిగే తంతే.తమకు పదవి, అధికారం ఉన్నన్ని రోజులు హోదాకు పలుకుబడికి లోటే ఉండదు.
అప్పుడు తాము ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా వారి రాజకీయ జీవితం సాగిపోతూ ఉంటుంది.కానీ అధికారం, పదవి ఒక్కసారి దూరమైతే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది.
అప్పటివరకు ఉన్న పలుకుబడి అమాంతం తగ్గడమే కాకుండా పలకరించేవారు కూడా తగ్గిపోతారు.తాము అధికారంలో లేకపోయినా, పార్టీ అధికారంలో ఉన్నావీరికి పెద్దగా కలిసి వచ్చేది ఏమీ ఉండదు.
ఇప్పుడు తెలంగాణ లో టిఆర్ఎస్ నాయకులు చాలామంది ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.గత ప్రభుత్వంలో మంత్రులుగా కీలక హోదాల్లో ఒక వెలుగు వెలిగిన టిఆర్ఎస్ కీలక నాయకులు చాలామంది ఇప్పుడు ఇదే ఇబ్బందిని ఎదుర్కుంటూ తమ బాధ ఎవరికీ చెప్పుకోవాలో తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో వారు ఉన్నారు.

తాము ఓటమి చెందినప్పటి నుంచి చి పార్టీ కూడా తమను చిన్నచూపు చూస్తోందని, తమను ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన చెందుతున్నారు.టిఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి మరింత పెరిగి పోయినట్టు ఆ పార్టీ నాయకులు బాధగా చెబుతున్నారు.మాజీ మంత్రులు జూపల్లి కృష్ణారావు, చందూలాల్ మహేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు తదితరులు ఓటమి చెందడంతో ఇంటికే పరిమితం అయిపోయారు.అయితే వీరిని ఇప్పుడు పార్టీ పెద్దగా పట్టించుకోవడం లేదట.

ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరావు గత టిఆర్ఎస్ ప్రభుత్వం మంత్రిగా ఎక్కడలేని ప్రాధాన్యం పార్టీలో సంపాదించుకున్నారు.ఆ విధంగానే ప్రభుత్వంలో ఆయన చక్రం తిప్పారు.కెసిఆర్ కూడా ఆయనకు ఎక్కడ లేని ప్రాధాన్యం ఇచ్చారు.కానీ ఈ ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు.అయితే తాను ఓడిన పార్టీ గెలిచింది కదా తనకు ఎమ్మెల్సీ కానీ, ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కుతుంది అని తుమ్మల ఆశ పడ్డారు.అయితే ఆయనను ఇప్పుడు పట్టించుకునే వారే కనిపించడంలేదట.

అలాగే 2014 టిఆర్ఎస్ మంత్రివర్గంలో డిప్యూటీ సీఎం, హోం మంత్రిగా ఎక్కడలేని ప్రాధాన్యం దక్కించుకున్న కడియం శ్రీహరి, నాయని నరసింహారెడ్డి ఆచూకీ పార్టీలో కనిపించడం లేదు.2018 ఎన్నికల్లో వారికి కనీసం పోటీ చేసేందుకు టికెట్ కూడా కెసిఆర్ ఇవ్వకుండా వారిని పక్కన పెట్టేయడం తో వారు మరింత రగిలిపోతున్నారు.ఇలా చెప్పుకుంటే వెళ్తే టీఆర్ఎస్ లో చాలామందే కనిపిస్తున్నారు.తమకు అసలు గుర్తింపే లేదని, తాము పదవుల్లో ఉండగా కేసీఆర్ ఎక్కడలేని ప్రాధాన్యం ఇచ్చారు.కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తారుమారయ్యింది అంటూ తమ సన్నిహితుల వద్ద తమ బాధ చెప్పుకుని సేద తీరుతున్నారట.