ప్రస్తుతం టాలీవుడ్‌లో యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ టైం నడుస్తున్న విషయం తెల్సిందే.‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ చిత్రాలతో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ తదుపరి చిత్రం ‘నోటా’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఇటీవలే విడుదలైన నోటా చిత్రం ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ దక్కింది.భారీ ఎత్తున నోటా చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుందని దర్శకుడు ఆనంద్ శంకర్ చెబుతున్నాడు.ఇక ఈ చిత్రం విడుదలతో రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రం విడుదల వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది.
దసరా కానుకగా ఎన్టీఆర్ అరవింద సమేత చిత్రం విడుదల ఉన్నా కూడా సెలవులు ఎక్కువగా ఉంటాయనే ఉద్దేశ్యంతో రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంను విడుదల చేయాలని భావించారు.కాని తాజాగా నోటాతో సునామిని సృష్టించేందుకు విజయ్ దేవరకొండ వస్తున్న నేపథ్యంలో తన సినిమాను విడుదల చేయడం ఏమాత్రం మంచిది కాదని రవితేజ భావిస్తున్నట్లుగా సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది.అందుకే సినిమాను డిసెంబర్‌లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.
శ్రీనువైట్ల దర్శకత్వంలో భారీ ఎత్తున తెరకెక్కుతున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంపై పెద్దగా అంచనాలు లేవు.ఆ కారణంగానే సినిమాను సోలోగా, మంచి సమయంలో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకున్నా కూడా దసరాకు విడుదల చేస్తే కలెక్షన్స్ నష్టపోవాల్సి ఉంటుందని నిర్మాతలు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విజయ్ సినిమా అటు ఎన్టీఆర్ సినిమాకు కూడా గట్టి పోటీ ఇస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
‘నోటా’కు ఎన్టీఆర్ అరవింద సమేత చిత్రంకు వారం రోజులకు పైగా గ్యాప్ ఉంది.
అయినా కూడా కాస్త టెన్షన్ వాతావరణం కనిపిస్తున్నట్లుగా సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.మొత్తానికి విజయ్ దేవరకొండ రెండు సినిమాలతోనే సెన్షేషన్ అయ్యాడు.
స్టార్‌లకు కూడా చెమటలు పట్టిస్తున్నాడు.